భద్ర… రవితేజ కెరీర్లో ఓ మంచి హిట్టు. ఈ సినిమాతోనే బోయపాటి శ్రీను అనే కుర్ర డైరెక్టరు టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. ఆ తరవాత మాస్ దర్శకుడిగా ఎదిగిపోయాడు. టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న దర్శకులలో బోయపాటి ఒకడిగా మారాడు. నిజానికి భద్ర సినిమా రవితేజ చేయాల్సింది కాదు. ఈ కథకు ముందు అనుకున్న హీరో.. అల్లు అర్జున్.
ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే.. ఆర్య తరవాత బన్నీ మంచి కథల కోసం ఎదురు చూస్తున్నాడు. సరిగ్గా అప్పుడే దర్శకుడిగా అవకాశాల కోసం వెదుకుతున్నాడు బోయపాటి శ్రీను. ఓ కథ పట్టుకుని.. గీతా ఆర్ట్స్ తలుపు తట్టాడు. అదే భద్ర. తొలి సిట్టింగ్ లోనే బన్నీకి ఈ కథ బాగా నచ్చేసింది. కాకపోతే.. అప్పటి తన వయసుకీ, స్టామినాకీ, ఇమేజ్‌కీ ఈ కథ సరితూగదేమో అనే భయం వేసింది. కానీ.. బోయపాటి శ్రీనుని నిరుత్సాహపరచకూడదు. అందుకే… బోయపాటిని తన కార్లో కూర్చోబెట్టుకుని సరాసరి దిల్ రాజు ఆఫీసుకి చేరాడు. `ఓ మంచి కథ విన్నా.. మీరు వినండి. మీకు తప్పకుండా నచ్చుతుంది` అని బోయపాటిని – దిల్ రాజునీ కలిపాడు. దిల్ రాజుకి కూడా బోయపాటి చెప్పిన కథ విపరీతంగా నచ్చేసింది. కానీ.. ఈ కథకు బన్నీ సెట్ అవ్వడని తెలుసు. `ఈ కథ నాతో కాదు. వేరెవరితోనైనా చేయండి. సూపర్ హిట్ గ్యారెంటీ` అని బన్నీ కూడా దిల్ రాజుకి భరోసా ఇచ్చాడు. అలా.. ఈ కథలోకి రవితేజ వచ్చాడు. మొత్తానికి భద్ర సెట్స్‌పైకి వెళ్లింది. సరిగ్గా పదిహేనేళ్ల క్రితం ఇదే రోజున భద్ర విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దేవిశ్రీ అందించిన పాటలన్నీ హిట్టే. మీరాజాస్మిన్‌కి కూడా మంచి పేరు వచ్చింది. బన్నీ చొరవతో.. భద్ర అనే సినిమా పట్టాలెక్కడం, బోయపాటి శ్రీను లాంటి దర్శకుడు వెలుగులోకి రావడం జరిగాయి. బోయపాటి కూడా సరైనోడు సినిమాతో బన్నీ రుణం తీర్చేసుకున్నాడు.