చిరంజీవి – కొరటాల శివ – ‘ఆచార్య’లో ఛాన్సు అందినట్టే అందుకుని, చేజార్చుకుంది త్రిష. ఈ అవకాశం జారింది అనేదానికంటే, త్రిషనే వదులుకుంది అనడం సబబు. ఎందుకంటే మణిరత్నం సినిమా కోసం చిరు ఆఫర్‌ని పక్కన పెట్టింది. ఆ స్థానంలో కాజల్ వచ్చి చేరింది. త్రిష సడన్ గా తప్పుకోవడం పట్ల, మెగా ఫ్యాన్స్ ఆమెపై కాస్త గుర్రుగా ఉన్నారు. కానీ ఈమధ్య త్రిష పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్ వేదిక చేసుకుని చిరంజీవి త్రిషకు శుభాకాంక్షలు తెలిపాడు. త్రిష కూడా సంతోషంగా స్పందించింది. దాంతో… ఈ గ్యాప్‌ని చిరు తనదైన శైలిలో క్లోజ్ చేశాడు.
ఇప్పుడు మరోసారి చిరుతో త్రిష కాంబో సెట్టయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చిరు ముందు మరిన్ని సినిమాలున్నాయి. లూసీఫర్, వేదాళం చిత్రాల్ని చిరు రీమేక్ చేయబోతున్నాడు. బాబితో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాల్లో ఏదో ఓ దాంట్లో త్రిష కథానాయికగా నటించబోతోందని టాక్. లూసీఫర్ లో హీరోయిన్ పాత్రకు ఛాన్సు లేదు.వేదాళంలో గానీ, బాబీ సినిమాలో గానీ త్రిషని చూడొచ్చు. ఈసారి ఈ ఛాన్స్‌ని త్రిష ఎట్టిపరిస్థితుల్లోనూ మిస్ చేసుకోదు. ఇది వరకు ‘స్టాలిన్’ కోసం వీరిద్దరూ తొలిసారి జోడీ కట్టిన సంగతి తెలిసిందే.