ఇది వరకు తెలుగులో వంద కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తున్నారంటే `ఔరా..` అంటూ ఆశ్చర్యపోయేవాళ్లు. ఆ వంద కోట్లనీ తిరిగి రాబట్టుకోగలిగే స్టామినా తెలుగు సినిమాకి ఉందని తెలిశాక… `వంద` పెద్ద షాకింగ్ నెంబర్ కాదు. బాహుబలి పుణ్యమా అని ఈ బడ్జెట్ వంద కోట్ల నుంచి రెండొందల కోట్లకు చేరింది. ఇప్పుడు దాన్ని కూడా దాటేసింది. `ఆర్.ఆర్.ఆర్` బడ్జెట్ రూ.300 కోట్లకు పైమాటే. సో… ఇప్పుడు బడ్జెట్ల విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలూ లేవు.
కాకపోతే.. కరోనా భూతం చిత్రసీమనీ భయపెట్టింది. రాబోయే రోజుల్లో చిత్రసీమ మరిన్ని గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోబోతోందని, బడ్జెట్లు తగ్గించకపోతే – చిత్రసీమ కుదేలైపోవడం ఖాయమని సినీ పండితులు హెచ్చరించారు. సురేష్ బాబు లాంటి అగ్ర నిర్మాత సైతం బడ్జెట్లు దారిలో పెట్టకపోతే, చిత్రసీమ కోలుకోవడం కష్టమని చెప్పారు. కాకపోతే.. బడ్జెట్ల విషయంలో టాలీవుడ్ పెద్దగా ఆలోచించడం లేదనే విషయం అర్థమవుతోంది. ఎందుకంటే.. చాలా సినిమాల బడ్జెట్లు ఇప్పుడు ఆకాశాన్ని తాకుతున్నాయి. కరోనా తరవాత.. కూడా బడ్జెట్లు తగ్గించడానికి ఎవ్వరూ ఇష్టపడడం లేదు.
ఆర్.ఆర్.ఆర్ దాదాపు మూడొంతుల షూటింగ్ పూర్తి చేసుకుంది. కాబట్టి.. ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ విషయం ఆలోచించడం అనవసరం. ప్రభాస్ – నాగ అశ్విన్ కాంబోలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ సినిమా బడ్జెట్ 250 కోట్ల పైమాటే. ఈ సినిమా బడ్జెట్ కరోనాకు ముందే నిర్ణయింపబడింది. అయితే ఇప్పటికీ ఈ బడ్జెట్లో ఎలాంటి మార్పూ లేదు. ఎన్టీఆర్ తో మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించబోతోంది. కేజీఎఫ్ తో అందరి దృష్టినీ ఆకట్టుకున్న ప్రశాంత్ నీల్ దర్శకుడు. ఈ సినిమా బడ్జెట్ రూ.150 నుంచి రూ.200 కోట్ల వరకూ ఉంటుందని టాక్. ప్రభాస్ – ఇంద్రగంటి మోహన కృష్ణ కాంబో కూడా ఇటీవలే సెట్ అయ్యింది. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. ప్రభాస్ సినిమా అంటే ఈ రోజుల్లో 150 కోట్లకు పైమాటే. ఈ సినిమాపైనా అదే స్థాయిలో ఖర్చు పెడతారనడంలో ఎలాంటి సందేహం లేదు. పుష్ష కోసం వంద కోట్లకుపైనేగా ఖర్చు పెడుతున్నారు. ఇందులో ఓ యాక్షన్ ఎపిసోడ్ ఖర్చు ఆరు కోట్లట. దీన్ని బట్టి ఖర్చు విషయంలో చిత్రబృందం ఏమాత్రం రాజీ పడడం లేదన్న విషయం అర్థమవుతోంది.
మొత్తానికి కోరోనా ప్రభావం టాలీవుడ్ బడ్జెట్‌పై ప్రస్తుతానికి ఏమాత్రం లేదని అర్థం అవుతోంది. రేపు థియేటర్లు తెరచి, వసూళ్లపరిస్థితి ఏమిటో అర్థమైతే, ప్రేక్షకుల మైండ్ సెట్ పై ఓ అంచనాకు వస్తే… నిర్మాతల బడ్జెట్ లెక్కలపై ఓ స్పష్టత వస్తుంది.