పోతిరెడ్డిపాడు విషయంలో తెలంగాణ సర్కార్ స్పందనపై విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏపీ సర్కార్ జీవో జారీ చేసిన తర్వాత వారం రోజుల పాటు ఏమీ పట్టనట్లుగా ఉన్న కేసీఆర్ కాంగ్రెస్ నేతలు విమర్శలు ప్రారంభించిన తర్వాత..సుప్రీంకోర్టుకు అయినా వెళ్తామనే ప్రకటించడం..వ్యూహాత్మకమేనని నమ్ముతున్నారు. అందుకే.. ఇదందా.. కేసీఆర్ – జగన్ పరస్పర అంగీకారంతోనే జరుగుతోందన్న విమర్శలు ప్రారంభించారు. నీళ్లు,నిధులు, నియామకాల కోసం జరిపిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన కోదండరాం.. ఈ విషయంలో మరింత దూకుడుగా ఉన్నారు.
రహస్య ఒప్పందం ప్రకారమే సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను జగన్కు తాకట్టుపెడుతున్నారని ఆయన నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. స్నేహ హస్తం ప్రజల మధ్య ఉండాలి కానీ నాయకుల మధ్య కాదని .. ఆస్తులను కాపాడుకోవడానికే కేసీఆర్, జగన్ స్నేహమని కోదండరాం అంటున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా.. అదే చెబుతున్నారు. జగన్..కేసీఆర్ ప్రగతి భవన్లో ఎన్నో విషయాలు చర్చించారని.. పోతిరెడ్డిపాడుపై కేసీఆర్, జగన్ మాట్లాడుకోలేదంటే నమ్మలేమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ నేతలు ప్రధానంగా దక్షిణ తెలంగాణ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు.
ఉత్తర తెలంగాణ కోసం నిధులన్నీ కేటాయిస్తున్న సర్కార్.. దక్షిణ తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇది రెండు ప్రాంతాల మధ్య వివక్షకు బీజం వేస్తుందన్న అభిప్రాయం రావడంతో కేసీఆర్.. ప్రజల్లో మరింత చర్చ జరగకముందే…ఆ జీవోపై..కార్యాచరణ ప్రారంభించారని అంటున్నారు. అయితే..ఇదంతా ప్రజల్ని మోసం చేయడానికేనని చెప్పేందుకు విపక్షాలు వ్యూహం సిద్ధం చేసుకుంటున్నాయి.