విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేసేదిశగా పేపర్ వర్క్ మొదలౌతోంది. ప్రధానమంత్రి కార్యాలయం సూచనపై రైల్వేబోర్డు ఈ మేరకు కసరత్తు ప్రారంభించింది. పొరుగురాష్ట్రమైన ఒడిస్సా కు ఇది ఇష్టంలేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా ఒడిస్సా వ్యతిరేకించింది.
నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా వున్న బిజెడి (బిజూ జనతా దళ్) ఒకప్పుడు బిజెపి మిత్రపక్షం. ఆపార్టీ ఎంపిలు ఇటీవల పార్లమెంటులో కలసి పోలవరం ప్రాజెక్టునిర్మాణాన్న నిలిపివేయించాలని ప్రధానమంత్రిని కోరినపుడు ”విభజన చట్టంలో పొందు పరచిన పోలవరం ప్రాజెక్టుని ఎవరూ ఆపలేరు” అర్ధం చేసుకోవాలి అని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ఒక కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్నది కూడా విభజన చట్టంలో వున్న అంశమే! విశాఖకేంద్రంగా రైల్వై జోన్ ఏర్పాటు చేయడం వల్ల తూర్పుకోస్తాలో అభివృద్ధి లో పన్నులు సుంకాల్లో వాటా ఆంధ్రప్రదేశ్ కు వస్తుంది. ప్రస్తుత ఈస్ట్ కోస్ట్ జోన్ లో లక్షమంది ఉద్యోగులతో సహా ఆస్ధుల్ని కొత్తజోన్ కి బదిలీ చేయవలసి వుంటుంది. ఇది రాష్ట్ర ఎకానమీని కూడా దెబ్బతీస్తుందన్నది ఒడిస్సా అభ్యంతరం.
ఇది తన ఆదాయాన్ని కొల్లగొట్టి ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వడమేనని ఒడిస్సా అభ్యంతరపెడుతోంది. ఈ వివాదాన్ని పరిశీలించిన రైల్వేబోర్డు టెక్నికల్ కమిటీ ఒడిస్సా అభ్యంతరం సరైనదేనని నివేదిక ఇచ్చింది. ఎపికి రైల్వేజోన్ కూడా రాదని తేలిపోయిన నేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాబీయింగ్ – వడ్డింవాళ్ళలో మనవాడు ఒకడుంటే చాలు ఎక్కడ కూర్చున్నా ఫరవాలేదు అన్నట్టు వెంకయ్యనాయుడు చేసిన మాటసాయం వల్ల రైల్వేబోర్డు నివేదికను ప్రధాని కార్యాలయం తిరగదోడింది. విభజన చట్టప్రకారం ఈ అంశాన్ని పరిశీలించాలన్న నోట్ తో నివేదిక రైల్వే బోర్డుకి వెళ్ళింది. దీనిపై కమిటీ మరో నివేదిక ఇస్తుంది. సిఫార్సులు ఎలా వున్నాకూడా కేంద్రమంత్రి వర్గం కొత్తజోన్ మీద నిర్ణయం తీసుకోవచ్చు. రెండో నివేదిక వచ్చాక జరిగే కేంద్రమంత్రి వర్గ సమావేశంలో మంజూరు చేసే అవకాశం వుంది.
పొరుగురాష్ట్రమైన తెలంగాణాతో వనరులపై తగాదాలు – రాజకీయ సంబంధాలు ఒక వైపు ఎపిని ఇబ్బంది పెడుతూండగా, మరో పక్క రాష్ట్రమైన ఒడిస్సాతో కూడా సంబంధాలు అంతంత మాత్రంగానే వున్నాయి. గోదావరి డెల్టాల్లో రబీనాట్లకే నీరు కరువైపోయినపుడు ”మా కరెంటు తీసుకుని అప్పర్ సీలేరు నీళ్ళు ఇవ్వండి” అని ఆంధ్రప్రదేశ్ చేసిన విజ్ఞప్తి పై అదును ముగిసేదాక సమాధానమే రాలేదు. పోలవరం ప్రాజెక్టు, రైల్వేజోన్ ల విషయంలో ఆప్రభుత్వం మనోభావం మనకు వ్యతిరేకంగా వుండటమే ఇందుకు మూలం!
పోలవరం, రైల్వేజోన్ చట్టప్రకారం వచ్చినవే అనుకోడానికి వీలులేదు. ఎందుకంటే ఇచ్చినమాట నిలబెట్టుకోవాలన్న మర్యాద కూడాలేని చట్టాన్నైనా సరే తనకు వీలుగా వుంటేనే అమలు చేస్తుంది. కుదరకపోతే ఎంతకాలమైనా నానబెట్టే వుంచుతుంది. కొంచెంకూడా ఆత్మగౌరవం లేదా అనిపించేలా పదేపదే అదే అడుగుతున్న ”విక్రమార్కుడు” చంద్రబాబునాయుడు కే రైల్వే జోన్ క్రెడిట్ ఇవ్వాలి.