పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో కారణంగా కొంతకాలంగా సద్దుమణిగిన ఆంధ్ర తెలంగాణ గొడవలు మళ్లీ తెరమీదకు వచ్చాయి. అయితే ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇరు ప్రభుత్వాలు, అగ్ర మీడియా సహకారంతో ఈ డ్రామా నడిపిస్తున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
పోతిరెడ్డిపాడుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో సంగమేశ్వరం నుంచి శ్రీశైలం కుడి ప్రధాన కాలువలోకి రోజుకు మూడు టీఎంసీలు మళ్లించేలా ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడానికి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఉద్యమ సమయంలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు గురించి భారీగా విమర్శలు చేసిన కేసీఆర్, టిఆర్ఎస్ నేతలు ఆంధ్రప్రదేశ్ విడుదల చేసిన జీవో పై న్యాయ పోరాటం చేయడానికి సిద్ధం అంటూ ఈ జీవో పై స్పందిస్తున్నారు. అయితే మీడియా లో కనిపిస్తున్న ఈ వార్తలన్నీ నాణేనికి ఒకవైపే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేకించి కేసీఆర్ కు తెలియకుండా జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని చాలామంది నెటిజన్లు భావించడం లేదు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఇదే అంశాన్ని హైలైట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో గత కొంతకాలంగా ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కరోనా ని సరైన రీతిలో హ్యాండిల్ చేయ లేక పోవడం కానీ, ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరగడం, ఆ తర్వాత కొందరు వైఎస్సార్సీపీ నేతలు ప్రవర్తించిన తీరు, నోరు జారిన తీరు, ఇవేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో షాక్ కొట్టేలా కరెంటు బిల్లులు రావడం వంటి అనేక సమస్యలు ఉన్న నేపథ్యంలో, ఈ సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వంతపాడే అగ్ర మీడియా సహకారంతో రెండు పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కొంత కాలం పాటు ఈ డ్రామా నడిపి ఆ తర్వాత ఇద్దరు ముఖ్య మంత్రులు పరస్పర ఆమోద యోగ్యమైన నిర్ణయానికి వచ్చారు అంటూ ఒక బ్రేకింగ్ న్యూస్ వేసి కథను సుఖాంతం చేస్తారని వారు అంటున్నారు.
మరి ఇది నిజమా, లేక నిజంగానే కెసిఆర్ కు వ్యతిరేకంగా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే సాహసం జగన్ చేస్తాడా, ఎన్నికలైన కొత్త లో విజయసాయి రెడ్డి వంటి నేతలు కెమెరా ల ముందే కెసిఆర్ కాళ్లకు మొక్కిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో అది సాధ్యం అవుతుందా అనేది వేచి చూడాలి.