పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లే విషయంలో తెలంగాణ సర్కార్ ను ఢీకొట్టాలని… సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం .. తమ పై చేస్తున్న ఆరోపణలు… చేస్తున్న ఫిర్యాదులను గట్టిగా తిప్పికొట్టాలని నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటిని తీసుకెళ్లడానికి మాత్రమే తాము ప్రాజెక్టులు కట్టుకుంటున్నామని … తెలంగాణ నీటిని చుక్క కూడా తీసుకోబోమంటూ.. ఏపీ సర్కార్ ఎదురుదాడి ప్రారంభించింది.
కేఆర్ఎంబీకి తెలంగాణ ఫిర్యాదులు..!
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవోపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా ఈ అంశాన్ని టేకప్ చేశారు. కృష్ణాబోర్డు చైర్మన్‌ను నేరుగా కలిసి వివరించాలని జలవనరుల శాఖ ఉన్నతాధికారులను కేసీఆర్ ఆదేశించారు. కేఆర్ఎంబీ చైర్మన్‌తో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్ భేటీ అయితే.. ఈ అంశంపై ఫిర్యాదు చేయనున్నారు. ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా నీటిని ఎలా తరలించాలని అనుకుంటుందో రజత్‌కుమార్ వివరించనున్నారు. టెండర్ల ప్రక్రియ వరకూ వెళ్లకుండా.. నిరోధించడానికి.. కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కేఆర్ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు చేసింది.
మా నీళ్లు మేం తీసుకోకూడదా అంటున్న ఏపీ సీఎం..!
మరో వైపు జగన్మోహన్ రెడ్డి ఎవరేమనుకున్నా.. ఆగదన్న పద్దతిలో పట్టుదల ప్రదర్శిస్తున్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తాగడానికి నీళ్లులేని పరిస్థితి ఉందని.. ఇలాంటి విషయాల్లో ఎవరైనా మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలని కేసీఆర్‌కు పరోక్షంగా చురకలంటించారు. రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే మేం వాడుకుంటామని.. కృష్ణా బోర్డు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి నీటికేటాయింపులు చేస్తుందని జగన్ గుర్తు చేశారు. ఏ రాష్ట్రం కూడా అదనంగా నీటిని వాడుకునే అవకాశం కూడా ఉండదని … మన నీటిని మనం తీసుకోవడానికి పోతిరెడ్డిపాడు వద్ద కట్టుకుంటున్నామని సీఎం స్పష్టం చేశారు. శ్రీశైలంలో 800 అడుగుల నుంచి తెలంగాణ రాష్ట్రం నీరు తీసుకుంటోందని.. అలాంటప్పుడు.. కేటాయింపుల ప్రకారం మనం నీటిని తీసుకుంటే తప్పెలా అవుతుందని జగన్ ప్రశ్నించారు.
మళ్లీ రాజకీయ వివాదంగా పోతిరెడ్డిపాడు …!
ప్రస్తుతం వివాదం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ముందుకు చేరింది. వరద నీటి వినియోగంపై ఈ సమావేశం జరగనుంది. అయితే.. ఈ సమావేశంలో ప్రధానంగా పోతిరెడ్డిపాడు పై ఏపీ సర్కార్ ఇచ్చిన జీవోనే హైలెట్ కానుంది. ఇప్పటికే తెలంగాణ లిఖిత పూర్వక ఫిర్యాదు పంపింది. ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టు నిర్మాణం, నీటి తరలింపును సమర్థించుకుంటోంది. తమ వాదన వినిపించే అవకాశం ఉంది. రాను రాను ఇది రాజకీయ అంశంగా మారే అవకాశం కనిపిస్తోంది.