తెలంగాణలో పంట విస్తీర్ణం పెరిగిపోతూండటంతో.. సీఎం కేసీఆర్ సంస్కరణలు తీసుకురావాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఈ మేరకు నిపుణుల నుంచి సలహాలు తీసుకుని కొత్త పద్దతులపై కసరత్తు చేస్తున్నారు. పంట మార్పిడి, క్రాప్ కాలనీల ఏర్పాటుపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ప్రభుత్వం చెప్పిన రకం పంటలు సాగు చేసిన రైతులకే రైతు బంధు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటికే ఈ అంశంపై మీడియాలో వార్తలు వచ్చాయి. టీఆర్ఎస్ నేతలు.. అది నిపుణుల సూచన మాత్రమేనని.. తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. చెబుతూ వస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం.. ఇది అధికారిక నిర్ణయమేనన్న సమాచారాన్ని గట్టిగానే బయటకు పంపుతున్నారు.
తెలంగాణలో ఇక ప్రభుత్వం చెప్పిన పంట వేస్తేనే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తారు. అందరూ ఒకే పంట వేసే విధానం పోవాలంటే.. కొన్ని చర్యలు తీసుకోక తప్పదని కేసీఆర్ భావిస్తున్నారు. కేవలం డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వరి సాగు ఏటికేడు పెరిగిపోతోంది. అందుకే ఈ సారి 50 లక్షల ఎకరాలకు మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించారు. రైతులకు లాభం చేయాలనే ఏకైక లక్ష్యంతోనే.. నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయాలని నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ చెబుతున్నారు. ఈ వర్షాకాలంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి, 10 లక్షల ఎకరాల్లో కందులు.. పట్టణ ప్రాంతాలకు సమీపంలో కూరగాయల సాగు చేయించాలని వ్యవసాయ శాఖను కేసీఆర్ ఆదేశించారు.
చెప్పిన పంట వేస్తేనే రైతు బంధు సాయం.. చెప్పిన పంట వేస్తేనే మద్దతు ధర.. తాము చెప్పిన పంటనే వేయాలనే ప్రభుత్వ విధానంపై ఇప్పటికే విపక్ష పార్టీలు మండి పడుతున్నాయి. టీజేఏస్ అధినేత కోదండరాం.. ఈ విషయంలో లీడ్ తీసుకుంటున్నారు. రెండు సార్లు విపక్ష పార్టీల నేతలందరితోనూ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విధానం ప్రమాదకరమని ఆయన ఉదాహరణలతో చెబుతున్నారు. ఈ విషయంలో పోరుబాట పట్టాలని డిసైడయ్యారు. అయితే.. కేసీఆర్ వీరెవరి అభిప్రాయాలను వినే అవకాశం లేదని ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు.