తెలుగు రాష్ట్రాల భారతీయ జనతా పార్టీకి పెద్ద చిక్కు వచ్చింది. ఇప్పుడు కొత్తగా తెలుగు రాష్ట్రాల మధ్య ప్రారంభమైన పోతిరెడ్డిపాడు ఇష్యూలో… ఆ పార్టీ స్టాండ్ … ఆ పార్టీ నేతలు పరస్పర విభిన్నమైన వాదనలతో ముందుకెళ్తున్నారు. రెండు రాష్ట్రాల నేతలూ… పక్క రాష్ట్రం తీరుపై విరుచుకుపడుతున్నారు. అక్కడే బీజేపీ నేతల తీరుపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచాలని జగన్ నిర్ణయించి జీవో జారీ చేయడంతో.. రెండు రాష్ట్రాల మధ్య భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు… తెలంగాణ సర్కార్ పై విరుచుకుపడ్డారు. రాయలసీమ ప్రాంత ప్రజలకు కనీసం సాగు నీరు, తాగునీరు లేకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. రాయలసీమకు అన్యాయం చేయాలని కేసీఆర్ చూస్తున్నారన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా జగన్.. పోతిరెడ్డిపాడు ముందుకే వెళ్లాలని డిమాండ్ చేశారు.
అదే సమయంలో తెలంగాణ బీజేపీ నేతలు కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతూ ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవోకు వ్యతిరేకంగా బుధవారం బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిరసనదీక్ష చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు విషయంలో గతంలో కేసీఆర్ విమర్శలకు గురైన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేత డీకే అరుణ హైదరాబాద్లోని తన ఇంట్లో దీక్ష చేయబోతున్నారు. దక్షిణ తెలంగాణకు చెందిన బీజేపీ నేతలంతా.. పోతిరెడ్డిపాడు విషయాన్ని రాజకీయంగా హైలెట్ చేసే అవకాశం ఉంది. ఎక్కడికక్కడ దీక్షలు.. ధర్నాలు.. చేసి.. కేసీఆర్ దక్షిణ తెలంగాణను నిర్లక్ష్యం చేస్తున్నారన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
అయితే ప్రస్తుతానికి అటు తెలంగాణ నేతలు.. ఇటు ఏపీ నేతలు.. పోతిరెడ్డిపాడు విషయంలో కేసీఆర్ వైఖరినే ప్రశ్నిస్తున్నారు. తప్పంతా కేసీఆర్ దేనని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఇలాంటి వివాదాల్ని రాజకీయ అంశాలుగా మలుచుకోవడంలో కేసీఆర్ ది అందే వేసిన చేయి. ఇలా సెంటిమెంట్ పెంచేసిన తర్వాత ఆయన ఒకే ఒక్క ప్రకటనతో.. మొత్తం క్రెడిట్ క్లెయిమ్ చేసుకుంటారు. ఈ సారి అలాంటి పరిస్థితి రాకుండా… చూసుకోవాలని బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కానీ.. రెండు రాష్ట్రాల్లో పరస్పర భిన్న విధానాలతో.. అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు.