పోతిరెడ్డిపాడుపై జగన్ జారీ చేసిన జీవో ప్రగతి భవన్‌లో తయారైందని.. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్, జగన్ సోడా, విస్కీల్లా కలసిపోయారని.. వారిద్దరినీ విడివిడిగా చూడాలేమని ఆయనంటున్నారు. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులకు కేసీఆర్ ఏనాడూ ప్రాధాన్యం ఇవ్వలేదని రేవంత్ చెబుతున్నారు. ఇప్పుడు పోతిరెడ్డిపాడు వివాదం కూడా.. టాపిక్ డైవర్షన్ కోసమే.. ఇద్దరు సీఎంలు.. మళ్లీ తెరపైకి తెచ్చారన్న అభిప్రాయంతో రేవంత్ రెడ్డి ఉన్నారు. మళ్లీ సెంటిమెంట్‌ను పండించేందుకే కేసీఆర్, జగన్ ఇలా ప్లాన్ చేసారనేది రేవంత్ రెడ్డి అభిప్రాయం.
నిన్నామొన్నటిదాకా… కేసీఆర్, జగన్ రాజకీయ మిత్రులు. ఇప్పుడు కూడా కాదు అనేంత విబేధాలు వారి మధ్య రాలేదు. ఏ విషయంలోనూ.. ఇప్పటి వరకూ రెండు రాష్ట్రాలు విభేదించుకున్న పరిస్థితి లేదు. ఉమ్మడిగా ప్రాజెక్టు కట్టాలనుకున్నారు కూడా. రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని స్వయంగా కేసీఆర్ చిత్తూరు జిల్లాలో.. రోజా ఇంటికి అతిథిగా వెళ్లి మరీ హామీ ఇచ్చి వచ్చారు. అలాంటిది…కేసీఆర్ సహకారంతోనే జగన్మోహన్ రెడ్డి .. రాయలసీమకు నీళ్లు అందించే ప్రాజెక్టులకు రూపకల్పన చేసి ఉండవచ్చు. కానీ.. అనూహ్యంగా ఏకపక్షంగా… తెలంగాణలో సెంటిమెంట్ పెరగడానికి అవకాశం ఉండే విధంగా… సున్నితమైన పోతిరెడ్డి పాడు ఇష్యూనే ఏపీ సీఎం.. హైలెట్ చేశారు.
ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే కాదు.. కర్నూలు బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. జగన్, కేసీఆర్ కావాలనే చేస్తున్నారని అంటున్నారు. కొన్ని రోజులు హడావుడి చేసి.. తర్వాత జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ అడ్డుకుంటున్నారని చేతులెత్తేస్తారని ఆయన అభిప్రాయం. మొత్తానికి… కృష్ణా జలాలపై.. రెండు రాష్ట్రాల మధ్య చెలరేగిన కొత్త వివాదాన్ని ఎవరూ రాజకీయ యుద్ధంగా చూడటం లేదు. ఇదో వ్యూహంగా మాత్రమే అంచనా వేస్తున్నారు.