హాకీ కోచ్ పుల్లెల గోపిచంద్‌కు కూడా క్వారంటైన్ స్టాంప్ వేశారని.. కానీ హైదరాబాద్ – విజయవాడ – విశాఖ మధ్య తిరుగుతున్న విజయసాయిరెడ్డిని మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని.. తెలంగాణ పోలీసులకు టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. తెలంగాణ పోలీసులు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారని.. వర్ల ప్రశంసించారు. కొద్ది రోజుల కిందట.. నల్లగొండ దగ్గర.. కారులో వస్తున్న పుల్లెల గోపీచంద్‌కు.. అక్కడి పోలీసులు హోంక్వారంటైన్ ముద్ర వేశారు. ఇది సోషల్ మీడియాలో హైలెట్ అయింది. అయితే.. వర్ల రామయ్య మాత్రం.. ఆ ముద్రను భిన్నమైన కోణంలో చూశారు.
తెలంగాణ పోలీసులు ఎవర్నీ వదిలి పెట్టకుండా.. రాష్ట్రంలోకి వస్తున్న వారందరికీ క్వారంటైన్ ముద్ర వేస్తున్నారని.. కానీ విజయసాయిరెడ్డికి మాత్రం ఎందుకు వేయడం లేదనే డౌట్ ఆయనకు వచ్చింది. అందుకే నేరుగా లేఖ రాశారు. లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి విజయసాయిరెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఉండనంత బిజీగా ఉన్నారు. ఆయన ఏ రోజూ లాక్ డౌన్ పాటించలేదు. వారాంతాల్లో ఆయన హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఎక్కువగా విజయవాడలో ఉంటున్నారు. తన కార్యక్షేత్రం విశాఖలోనూ.. తరచుగా కనిపిస్తున్నారు. తన ట్రస్ట్ పేరిట ఉత్తరాంధ్ర మొత్తం సహాయ సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. వాటిని అందించడానికి అప్పుడప్పుడు స్వయంగా వెళ్తున్నారు.
అంటే.. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వరకూ విజయసాయిరెడ్డి తిరుగుతూనే ఉన్నారు. దీన్నే వర్ల రామయ్య గుర్తు చేశారు. ఆయనకు హోం క్వారంటైన్ స్టాంప్ వేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ పోలీసులు ఈ లేఖను పరిగణనలోకి తీసుకోరు కానీ.. విజయసాయిరెడ్డి లాక్ డౌన్ ను పట్టించుకోుండా… అటూ ఇటూ తిరుగుతున్నారని జనం దృష్టికి తీసుకెళ్లడానికి మాత్రం.. వర్ల రామయ్యకు.. ఇదో మంచి అవకాశంలా దొరికింది.