చిత్రసీమ మాకన్నీ ఇచ్చింది.. సినిమా వల్లే మేం ఇలా ఉన్నాం, సినిమా లేకపోతే మా జీవితాలే లేవు..
– ఇదీ… హీరోలు, హీరోయిన్లు, దర్శకులు చెప్పే మాట.
బహుశా రాంగోపాల్ వర్మ లాంటి వాళ్లే… దీనికి విరుద్ధంగా స్టేట్మెంట్లు ఇస్తుంటారు. అలాంటి ప్రత్యేకమైన జీవుల్ని పక్కన పెట్టేస్తే – అందరిదీ ఇదే మాట. ఇప్పుడు తిరిగి ఇచ్చే సమయం ఆసన్నమైంది. రెగ్యులర్ డైలాగులో చెప్పాలంటే `సినీ కళామతల్లి రుణం తీర్చుకునే సమయం` వచ్చేసింది.
లాక్ డౌన్ వల్ల చిత్రసీమ చాలా కష్టనష్టాల్ని అనుభవిస్తోంది. ఆ నష్టాల్ని అంచనా వేయడం ప్రస్తుతానికి సాధ్యం కాదు. వందల కోట్ల రూపాయల పెట్టుబడి ఓ చోట ఆగిపోయింది. వాటికి సంబంధించిన వడ్డీల్ని నిర్మాతలు భరించాల్సివస్తోంది. చిత్రసీమ పూర్వపు పరిస్థితికి రావడానికి ఎంత సమయం పడుతుందో తెలీదు. ఇది వరకటిలా రికార్డు కలక్షన్లు వస్తాయన్న భరోసా లేదు. బడ్జెట్లు తగ్గించుకోవడం మినహా…. మరో మార్గం లేకుండా పోయింది. కానీ.. మన కథలెప్పుడో నేల విడిచి సాము చేయడం మొదలెట్టాయి. అంకెలన్నీ హద్దులు దాటుతున్నాయి. పాటకు నాలుగు కోట్లు, ఫైటింగులకు ఆరు కోట్లు లేకపోతే తీసినట్టే అనిపించడం లేదు. పైగా మనవన్నీ పాన్ ఇండియా సినిమాలాయె. బాలీవుడ్ నుంచో కోలీవుడ్ నుంచో ఖరీదైన నటీనటుల్ని దిగుమతి చేసుకోవాలి. లేదంటే.. తెర నిండుగా కనిపించదు.
సినిమా క్వాలిటీ తగ్గించడానికి ఎవ్వరూ ఇష్టపడడం లేదు. క్వాలిటీ ఉండాలి, బడ్జెట్లు తగ్గాలి అంటే ఒకటే మార్గం. హీరోలు పారితోషికాల్ని తగ్గించుకోవాలి. అప్పుడే నిర్మాతలకు వెసులుబాటు దొరుకుతుంది. మన టాప్ హీరోల పారితోషికాలు ఎప్పుడో పాతిక కోట్ల మార్కుని దాటేశాయి. దానికి తోడు… ఓవర్సీస్ రైట్స్ ఇవ్వండి, శాటిలైట్ రైట్స్ ఇవ్వండి అంటూ అదనంగా గింజుకుంటున్నారు. మారిన పరిస్థితుల దృష్ట్యా.. ఇది వరకటి స్థాయిలో పారితోషికాల్ని ఆశించకూడదు. కానీ.. హీరోలు తగ్గుతారా? వరుసగా ఫ్లాపులు అందుకుంటున్న ఓ మాస్ హీరో, సినిమాలు తన్నేస్తున్నా – సినిమా సినిమాకీ పారితోషికం పెంచుకుంటూ పోతున్నాడు. అలాంటిది చేతిలో హిట్స్ ఉన్న హీరో ఆగుతాడా? ఎడా పెడా బాదేస్తుంటారు.
ఇటీవల తమిళ హీరో విజయ్ ఆంటోనీ తన పారితోషికంలో 25 శాతం నిర్మాతలకు వెనక్కి ఇచ్చేశాడు. ఆల్రెడీ అందుకున్న పారితోషికంలో రిబేటు ఇవ్వడం ఇప్పుడు తమిళ నాట చర్చనీయాంశమైంది. అతని బాటలో మిగిలిన హీరోలూ నడవాలని చిత్రసీమ ఆశ పడుతోంది. చిన్నా చితకా హీరోలు విజయ్ లానే ఆలోచించి, పారితోషికాల్ని తగ్గించుకుంటున్నారు. కానీ బడా హీరోలెవరూ ముందడుగు వేయడం లేదు. తెలుగులో అలాంటి అడుగు ఎవరేస్తారో చూడాలి. `నేను పారితోషికాన్ని తగ్గించుకున్నా` అని ఏ పెద్ద హీరో ప్రకటించినా, తన పారితోషికంలో ఎంతో కొంత తిరిగి ఇచ్చేసినా – తప్పకుండా మిగిలిన హీరోల్లోనూ చలనం వస్తుంది. సినిమా హిట్టయి, ఊహించనంత లాభాలొస్తే – ఎలాగూ నిర్మాతలు హీరోల కష్టాన్ని ఉంచుకోరు. ఏదో ఓ రూపంలో తిరిగి ఇచ్చేస్తుంటారు. కనీసం దాన్ని దృష్టిలో ఉంచుకునైనా కథానాయకులు పెద్ద మనసు చూపిస్తే మంచిది.