మెల్లమెల్లగా టాలీవుడ్ మొత్తం వెబ్ సిరీస్ల వైపు అడుగులేస్తోంది. న్యూ జనరేషన్ హీరోలెప్పుడో వెబ్ సిరీస్ల ఆవశ్యకతని గుర్తించారు. వాళ్ల దృష్టిలో సినిమా అయినా వెబ్ సిరీస్ అయినా ఒక్కటే. దానికీ సినిమా స్థాయి ప్రిపరేషన్లు అవసరం. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా ఓ వెబ్ సిరీస్ మొదలెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు. ‘ఆహా’ కి విజయ్ బ్రాండ్ అంబాసిడర్గా మారిన సంగతి తెలిసిందే. తన వంతుగా ఆహా కోసం కొన్ని వెబ్ సిరీస్లలో పాలుపంచుకోబోతున్నాడు.
విజయ్ నిర్మాణ సంస్థ అయిన కింగ్ ఆప్ ది హిల్స్ తరపున ఒకట్రెండు వెబ్ సిరీస్లు ప్రస్తుతం ప్లానింగులో ఉన్నాయి. అందులో ఓ ప్రాజెక్టుని కేవీఆర్ మహేంద్రకి అప్పజెప్పే అవకాశాలున్నాయి. ‘దొరసాని’ సినిమాకి దర్శకత్వం వహించాడు మహేంద్ర. అందులో విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ కథానాయకుడు. ఆ పరిచయం కొద్దీ మహేంద్రకు ఈ వెబ్ సిరీస్ అప్పగించినట్టు తెలుస్తోంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని కూడా సినిమా రంగం నుంచే ఎంచుకోబోతున్నాడు విజయ్. త్వరలోనే ఆ విషయాలన్నీ బయటకు రానున్నాయి.