విద్యుత్ బిల్లులు పెంచలేదని ఏపీ సర్కార్ పెద్దలు, అధికారులు రోజూ ప్రెస్మీట్ పెట్టి చెబుతున్నారు. కానీ ప్రజలు మాత్రం ఎవరూ వినడం లేదు. మాకు కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందంటే..మాకు ఎక్కువ వచ్చిందంటూ… ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు. తాము ఎక్కడి నుంచి తెచ్చి కడతామంటూ అసలు బిల్లులు కట్టడమే మానేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా.. . ఒక్క నెల మీటర్ రీడింగ్ తీయకపోవడనే…ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలకు ఎక్కడ లేని కష్టం వచ్చింది. రెండు నెలలకు ఒకే సారి రీడింగ్ తీశారు. ఎక్కువ యూనిట్లు వాడేసి ఉంటారు కాబట్టి..సహజంగానే శ్లాబ్ మారిపోతుంది.
శ్లాబ్ మారిపోతే… వంద వచ్చే బిల్లు వెయ్యి అవుతుంది. బిల్లులు ఇచ్చేటప్పుడే ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాల్సింది. కానీ.. మొత్తం కలిపి బిల్లు ఇచ్చేయడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చెప్పా పెట్టకుండా రేట్లు పెంచారంటూ.. మండిపడుతున్నారు. దీనిపై వివరణ ఇచ్చుకోవడానికి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు సమయం సరిపోవడం లేదు. వేలకు వేలు బిల్లులు ఇస్తే…తాము ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలనే ప్రశ్నలు వస్తూండటంతో.. జూన్ పదిహేనో తేదీ లోపు ప్రత్యేకంగా అపరాథ రుసుమలు లేకుండా కట్టొచ్చని ఆఫర్ ఇస్తున్నారు.
కానీ ప్రజలు మాత్రం.. అసలు వాస్తవంగా తాము వాడుకునేదానికి కడతాం కానీ.. ఎంత సమయం ఇచ్చినా…ఎక్కువ ఎందుకు కడతామని ప్రశ్నిస్తున్నారు. మంత్రులకు కూడా ఇదే అంశంపై అదే పనిగానిరసనలు,విజ్ఞాపనలు వస్తూండంతో.. వారు కూడా కరెంట్ చార్జీలు పెంచ లేదని చెప్పడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ సమస్యకు ఎలా పరిష్కారం చూపించాలా అని పెద్దలు తలలు పట్టుకోవాల్సి వస్తోంది.