“మీ సొంత డబ్బులేమైనా ఇస్తున్నారా..?”… ప్రభుత్వ పథకాల పేరుతో నేరుగా నగదు బదిలీ పథకాలు పెట్టి.. ఆ డబ్బులు చేతికిస్తూ.. తమను గుర్తుంచుకోవాలంటూ.. రాజకీయ పార్టీల నేతలు లబ్దిదారులకు చెబుతున్నప్పుడు.. సూటిగా సుత్తిలేకుండా వస్తున్న ప్రశ్న ఇది. ప్రజలు ఈ మాత్రం చైతన్యవంతులవుతున్నారంటే.. మన సమాజం కాస్త ముందుకెళ్తున్నట్లే భావించాలి. అనేకానేక నగదు బదిలీ పథకాలు ప్రవేశ పెడుతున్న ప్రభుత్వాలు.. ఆ డబ్బుల్ని మళ్లీ ప్రజల నుంచే బాదేస్తూంటాయి. అది వివిధ రూపాల్లో సాగుతూంటుంది. గతంలో.. ప్రభుత్వాలు ఇలాంటి సంక్షేమ పథకాలు తక్కువగా పెట్టేవి. ఇప్పుడు సంక్షేమ పథకాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ కారణంగా ప్రజల వద్ద నుంచి డబ్బు పిండటం.. పథకాల పేర్లతో వారికి పంచడం కామన్‌గా మారిపోయింది. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్.. పిండటం దగ్గర్నుంచి తోలు తీసే వరకూ వస్తోంది. ప్రజలు తోలు తీయించుకోవాలి కూడా.. ఎందుకంటే.. ఆయన పంచి పెడుతున్న డబ్బుల బడ్జెట్ ఆ స్థాయిలో ఉంది. జగన్ అయినా.. మరో సీఎం అయినా ప్రజల వద్ద నుంచి వసూలు చేసి ప్రజలకు పంచాల్సిందే. ఈ ఈ వసూళ్లో జగన్ గడుసుతనం ప్రదర్శిస్తున్నారు కాబట్టి… ప్రజల తోలు కూడా వలిచేస్తున్నారు.
మందు బాబుల నుంచి వసూలు చేసేది రూ. 25వేల కోట్లు..!?
ఏ ప్రభుత్వానికైనా ఎక్సైజ్ ఆదాయం ఊపిరి లాంటిది. ప్రజల్ని వ్యవసనానికి గురి చేసి.. ఆ వ్యవసం నుంచి డబ్బులు పిండుకునేందుకే ఎక్సైజ్ శాఖ ఉంది. ఆ ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం అనే తేడా లేకుండా.. అందరూ ప్రజల్ని మద్యానికి బానిస చేసి.. ఆదాయం చూసుకునేవారు. ఎవరూ తాము మద్యాన్ని నిషేధిస్తామని చెప్పలేదు. కానీ మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి.. దానిపై అలవి మాలిన ఆదాయాన్ని కళ్ల జూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఎక్సైజ్ ఆదాయం రూ. 6220 కోట్లు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే ఆ ఆదాయం రూ. 25 వేల కోట్ల వరకూ చేరుతోంది. మందు బాబులకు ధర షాక్ కొట్టేలా చేస్తామంటూ.. ఎనిమిది నెలల క్రితం.. కొత్త మద్యం విధానం తెచ్చినప్పుడు… ఇరవై ఐదు శాతం ధరలు పెంచిన ఏపీ సర్కార్… ఎనిమిది నెలల తర్వాత లాక్ డౌన్ దెబ్బతో.. మరో 75 శాతం పెంచింది. అంటే.. రెట్టింపు ధరలను చేసినట్లయింది. కానీ ఆదాయం మాత్రం మూడింతలు.. పెరిగి.. దాదాపుగా పాతిక వేల కోట్లు వస్తాయని అంచనా వేసుకుంటోంది. పెంచిన ధరలతోనే రూ. పది వేల కోట్ల అదనపు ఆదాయం అంచనా వేస్తున్నారు. ఇదంతా ప్రజల సొమ్మే. మద్యం అనేది వ్యసనం. రేట్లు పెంచడం ద్వారా కాదు.. నిషేధించడం ద్వారాను.. ఆ అలవాటను మాన్పించలేరు. అసలు గుట్కాను నిషేధించారు. ఎక్కడ అమలవుతోంది. ఆంధ్రలో ప్రతీ చిన్న గ్రామంలోనూ గుట్కా దొరుకుంది. మద్యం ఎక్కువ ధర ఉంటే మాత్రం కొనుగోలు చేయకుండా ఉంటారా..? ఇంట్లో ఉన్న సామాన్లు తాకట్టు పెట్టి అయినా ఉన్నంత వరకూ తాగుతారు. లేకపోతే.. వ్యసనపరులు.. దోపిడీలు.. దొంగతనాలకు పాల్పడతారు. ఇలాంటి వసూలు విధానాల వల్ల వచ్చి పడే ఉపద్రవం అది మాత్రమే.
ఆ కరెంట్ చార్జీల బాదుడేంది..? ఎక్కడ్నుంచి తెచ్చి కడతారు..?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి .. ఎక్కడ బహిరంగసభలో మాట్లాడినా.. ఈ డైలాగ్ కామన్. నిజానికి ఐదేళ్ల టీడీపీ హయాంలో కరెంట్ బిల్లులు ఒక్క సారి కూడా పెంచలేదు. ఇక పెంచేది లేదని.. తగ్గించడానికి ప్రయత్నిస్తామని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు చెప్పేవారు. అయితే.. అప్పుడు జగన్మోహన్ రెడ్డి బాదుడే బాదుడు అని విమర్శలు గుప్పించేవారు. కరెంట్ బిల్లులు షాక్ కొట్టేలా వస్తున్నాయని చంద్రబాబు దోచేస్తున్నారని అనేవారు. కరెంట్ చార్జీలు పెంచకుండా.. ఎక్కువ ఎలా వస్తాయన్న లాజిక్ పక్కన పెడితే ఇప్పుడు జగన్ సీఎం అయ్యారు. ఆయన అధికారికంగా కరెంట్ చార్జీలు పెంచుతున్నామన్న ప్రకటన చేయకుండానే… బిల్లులు వేలకు చేర్చేశారు. ఏ గ్రామంలో చూసినా.. ఏ పట్టణంలో చూసినా అదే గగ్గోలు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లేకపోయినా… బిల్లు మాత్రం.. వేలల్లో వచ్చింది. తాము ఎక్కడ్నుంచి తెచ్చి కట్టగలమని… ప్రజలంతా.. దీనవదనంతో ప్రశ్నిస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. తాము కరెంట్ చార్జీలు పెంచనే లేదని ప్రభుత్వం వాదిస్తోంది. మరి అంత బిల్లులు ఎలా వచ్చాయో…ఎక్కడ తప్పు జరిగిందో ప్రభుత్వమే కరెక్ట్ చేయాలి కదా.. కానీ.. బిల్లుల చెల్లింపులకు కొంత గడువు ఇస్తామంటున్నారు కానీ.. ఆ బిల్లులను కరెక్ట్ చేస్తామని మాత్రం చెప్పడం లేదు.
ఉపాధి కోల్పోయిన జనానికి సాయం చేయాల్సింది పోయి పిండుకుంటారా..?
మద్యం. కరెంట్ బాదుడే కాదు.. జగన్మోహన్ రెడ్డి సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత రెండు సార్లు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంచారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ లీటరుకు 2 తగ్గించింది. ఆ సమయంలో, పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటాయి. ప్రజలపై భారం పెరుగుతుందన్న ఉద్దేశంతో తగ్గించారు. ఈ రెండు రూపాయలను.. జగన్ సీఎం అయ్యాక వ్యాట్ పెంపుతో కవర్ చేశారు. ఆర్టీసీ బస్సు చార్జీలను కూడా పెంచారు. పల్లె వెలుగు, సిటీ సర్వీసుల్లో కిలో మీటర్ కు పది పైసలు పెంచారు. మిగతా బస్సులో కిలో మీటర్ కు 20 పైసలు పెంచారు. ఈ బాదుడు ఇలా ఉండగానే.. లాక్ డౌన్ కారణంగా… బస్సు చార్జీలపై కూడా యాభై శాతం బాదేసే ప్లాన్ లో ప్రభుత్వం ఉందన్న చర్చ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలా బిల్లులు వసూలు చేస్తే.. ఉపాధి లేక అప్పుల పాలయిన ప్రజలు దివాలా తీయడం ఖాయమనే విమర్శలు వస్తున్నాయి. అయినా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు.
ఆస్తులూ తెగనమ్మేసి దివాలా అంచులకు చేరుస్తారా..?
సంపాదించే వాడికే ఖర్చు పెట్టే అర్హత ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ ఏపీ సర్కార్.. సంపాదన అంటే.. పన్నులు పెంచడం… ఆస్తులు అమ్మడం అనుకుంటోంది. వివిధ రకాల పన్నులను భారీగా పెంచేసిన ఏపీ సర్కార్ ఇప్పుడు ఖరీదైన భూముల అమ్మకంపై కన్నేసింది. మొదటి విడతగా గుంటూరు, విశాఖల్లోని స్థలాలను అమ్ముతోంది. మూడు వందల కోట్ల ఆదాయం కళ్ల జూసేందుకు సిద్ధమవుతుంది. అమ్ముతున్న స్థలాల్లో గుంటూరులో మార్కెట్.. విశాఖలో పోలీస్ క్వార్టర్స్ ఉండటమే… ఏపీ సర్కార్ ఆలోచనల దివాలాకు దర్పణం. సంపద సృష్టించి.. దాన్ని అమ్మి.. ప్రజలకు మేలు చేయడం.. ప్రభుత్వాల ప్రాథమిక కర్తవ్యం. ఉన్నవాటిని అమ్మేయడం కాదు.
ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం తప్పు కాదు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినవన్నీ అమలు చేయడం అధికార పార్టీగా బాధ్యత కూడా. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పథకాలను అమలు చేయడానికి షార్ట్ కట్‌గా.. ప్రజల నుంచే బాదేసే ప్లాన్లు అమలు చేయడమే… కాస్త తేడాగా మారుతోంది. మా సొమ్ము వసూలు చేసి.. మాకు ఇస్తున్నారని… మా దగ్గర ఇంకా ఎక్కువే వసూలు చేస్తున్నారన్న అభిప్రాయానికి.. ప్రజలు వస్తున్నారు. ఇది అంతకంతకూ పెరిగితే… తిరుగుబాటుకు కారణం అవుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుని సంక్షేమ పథకాల అమలుకు ఇతర వనరులు సమీకరించుకుని ప్రజలపై భారం తగ్గిస్తేనే ప్రయోజనం…లేకపోతే.. ప్రజల ఆగ్రహాన్ని పట్టడం కష్టం కావొచ్చు.