రైతు భరోసా సొమ్మును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. 49 లక్షల మందికిపైగా రైతులు… ఈ పథకం కింద లబ్దిదారులుగా ఉన్నారు. వీరికి మొత్తం రూ. 7500 ఇవ్వాల్సి ఉన్నప్పటికీ.. కేంద్రం ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన కింద ఇస్తున్న రూ. రెండు వేల రూపాయలను ఏప్రిల్లోనే జమ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మొత్తం రూ. 5500కి తగ్గిపోయింది. ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేసింది. నగదు విడుదల సందర్భంగా.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం పని చేస్తోందని జగన్ ఈ సందర్భంగా వారికి భరోసా ఇచ్చారు. కరోనా కారణంగా రెండు వేలు ఏప్రిల్లోనే ఇచ్చినందున ఇప్పుడు రూ. 5500 జమ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఇస్తున్న సాయాన్ని బ్యాంకర్లు ఇతర రుణాల కింద జమ చేసుకోరని..నేరుగా.. రైతులు తీసుకోవడానికి అవకాశం ఉందని.. జగన్ స్పష్టం చేశారు. బ్యాంకుల నుంచి ఏదైనా ఇబ్బందులు ఉంటే 1902కు ఫోన్ చేయాలని రైతులకు సూచించారు. పెట్టుబడి సాయంతో రైతులకు చాలా ప్రయోజనం చేకూరుతుందని జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
రానున్న రోజుల్లో రైతుల కోసం తీసుకోబోతున్న చర్యలను జగన్ ప్రకటించారు. రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు జనతా బజార్లను ఏర్పాటు చేస్తామని.. అలాగే కోల్డ్ స్టోరేజీలను నిర్మిస్తామన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లోనూ వ్యవసాయ బోర్డులు ఏర్పాటు చేసి.. రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఖరీఫ్ నాటికి రైతులకు పగటిపూట 9గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఈనెల 30న 10,641 రైతు భరోసా కేంద్రాలను ఆవిష్కరిస్తామన్నారు.