లాక్డౌన్ కారణంగా ప్రజలందరూ ఇళ్లలోనే ఉన్నారు. వారు విపరీతంగా కరెంట్ వాడుకున్నారు. అందుకే ఎక్కువ బిల్లులు వచ్చాయిని… ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. రాష్ట్రం మొత్తం కరెంట్ బిల్లులు ఎక్కువగా వచ్చాయని ప్రజలు గగ్గోలు పెడుతూంటే.. వారికి వివరణ ఇవ్వడానికి ఏపీ సర్కార్ కు తలకు మించిన భారం అవుతోంది. విద్యుత్ బిల్లుల విషయంలో ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తూండటంతో ఎలా సర్ది చెప్పాలో తెలియక ప్రభుత్వం సతమతమవుతోంది. రోజుకో మంత్రి వివరణ ఇస్తున్నా…ప్రజల్లోకి వెళ్లడం లేదు. దీంతో ఈ సారి బాధ్యతను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీసుకున్నారు. ఆయన కొన్ని విద్యుత్ బిల్లులను తీసుకుని మీడియా ముందుకు వచ్చారు.
అందులో బిల్లులకు ఎలా చార్జ్ చేశారో వివరించారు. తాము ఐదు వందల యూనిట్లు దాటిన వారికి మాత్రమే.. యూనిట్‌కు 90పైసలు పెంచామని..మిగతా ఏ కేటగిరీకి కూడా పెంచలేదని స్పష్టం చేశారు. మరి ఎందుకు బిల్లులు ఎక్కువగా వచ్చాయన్నదానిపై ఆయన ఒక్కటే వాదన వినిపించారు.లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లలోనే ఉన్నారని.. అందుకే కరెంట్ వినియోగం పెరిగిందని చెబుతున్నారు. ఎంత మంది ఇళ్లలో ఉన్నా మధ్యతరగతి ప్రజలు వాడేది మహా అయితే రెండు ఫ్యాన్లు, రెండు లైట్లు… ఓ టీవీ. అంత దానికి నెలకు ఐదు వందల యూనిట్లు దాటిపోయేంత బిల్లురాదు.
కానీ ఎక్కువ మందికి ఐదు వందల యూనిట్లు దాటిపోయి.. బిల్లులు అత్యధికంగా వచ్చాయి. ఇలాంటి కారణాలు ఎన్ని చెప్పినప్పటికీ.. విద్యుత్ బిల్లుల విషయంలో ప్రజలకు ఏదో ఓ భరోసా ఇవ్వాల్సి ఉంది. లేకపోతే.. ప్రభుత్వానికే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి.