ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ సలహాదారుడి పదవి పీకేసింది.పోలవరం ప్రాజెక్టు సాంకేతిక, న్యాయ సలహాదారుగా పని చేస్తున్న హెచ్‌కే సాహును విధుల నుంచి తప్పిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జలవనరులశాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయంలో ప్రాజెక్టు సాంకేతిక, న్యాయ సలహాదారుగా పనిచేస్తున్న సాహు .. పనితీరు సంతృప్తికరంగా లేదని ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు సీఈ నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా ఆయనను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదుల సంఖ్యలో సలహాదారులను నియమించుకున్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.మూడు లక్షల వరకూ జీతభత్యాలు ఇస్తూ.. వస్తున్నారు.
ఆ సలహాదారులేం చేస్తున్నారో చాలా మందికి తెలియదు. హఠాత్తుగా..హెచ్‌కే సాహును పదవి నుంచి తొలగించడంతో.. ఈ సలహాదారుల సేవలపై ఏపీ సర్కార్ రివ్యూ చేస్తోందేమో అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నియమించుకున్న ఒక్క సలహాదారు పనితీరును కూడా ఇంత వరకూ రివ్యూ చేయలేదు. హెచ్ కే సాహు పోలవరం ప్రాజెక్ట్ సాంకేతిక,న్యాయ సలహాదారుగా టీడీపీ హయంలోనే నియమితులయ్యారు. 2018 ఏప్రిల్ 14న సాహుని అప్పటి ప్రభుత్వం నియమించింది. నెలకు రూ.రెండు లక్షల వరకూ జీతభత్యాలు ఇస్తోంది. జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పోలవరంకు సంబంధించిన కీలక అధికారులందర్నీ మార్చేశారు.
సలహాదరుగా ఉన్న సాహును తప్పించడానికి మాత్రం దాదాపుగా ఏడాది సమయం తీసుకున్నారు. ఇప్పడు జనవనరుల రంగంలో.. టెక్నికల్‌గా.. న్యాయపరంగా నిపుణుడైన ఆయనను.. ఇప్పుడు పనితీరు బాగోలేదని ముద్ర వేసి తీసివేయడమే.. అందర్నీ ఆశ్చర్యరానికి గురిచేస్తోంది. నిజంగా పనితీరే ప్రామాణికం అయితే.. ఇబ్బడిమబ్బడిగా నియమితులైన సలహాదారులందరి పనితీరునూ మదింపు చేయాలనే చర్చ సహజంగానే వస్తోంది.