ప్రధానమంత్రి మోడీ ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ప్యాకేజీలో మూడో భాగాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ సారి రైతులకు, మత్స్యకారులకు ప్రాధాన్యం ఇచ్చారు. ముందుగా.. ఈ లాక్ డౌన్ సమయంలో ఎంతెంత రైతులకు సాయం చేశారో చెప్పుకొచ్చారు. పాల సేకరణకు రూ.4100 కోట్లు ఖర్చు చేశామని.. ఇక ముందు 2 కోట్ల మంది పాడి రైతులకు రూ.5 వేల కోట్ల నిధులు అందిచబోతున్నామన్నాన్నారు. ఫసల్ బీమా యోజన కింద రూ.6400 కోట్లు … రైతుల నుంచి రూ.74,300 కోట్లతో ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఇక ప్యాకేజీలో భాగంగా రైతులకు చేయబోయే ఉపయోగాలను నిర్మలా సీతారామన్ వివరించారు. అగ్రి ఇన్ ఫ్రా కోసం రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించారు. వీటితో కోల్డ్ స్టోరేజీల్లాంటివి కట్టుకోవచ్చన్నారు. మత్స్యకారుల కోసం రూ.20 వేల కోట్లతో పీఎం మత్స్య సంపద యోజనను అమలుచేయ బోతున్నారు. బోట్ల కొనుగోలుకు ఆర్థిక సాయమందిస్తే.. దేశ ఆక్వా ఎగమతులు పెరగుతాయన్నారు.
రూ.13,300 కోట్లతో పాడిపశువులకు టీకా కార్యక్రమం నిర్వహించబోతున్నట్లుగా ఆర్థిక మంత్రి మరో కార్యక్రమంప ్రకటించారు. రూ.15వేల కోట్లతో పాడి ఉత్పత్తుల ప్రాసెసింగ్, ఎగుమతుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. రూ.4వేల కోట్లతో మూలికా సంబంధమైన మొక్కల పెంపకానికి సాయం చేస్తామని.. మూలికా రంగం ద్వారా.. రూ.5 వేల కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశముందని నిర్మలా సీతారామన్ అంచనా వేశారు. కోవిడ్ 19 సమయంలో వ్యాధి నిరోధకశక్తి పెంచడంలో.. మూలికలు ఎంతో కీలకమో చూస్తున్నామని ఆమె చెప్పుకొచ్చారు. తేనెటీగల పెంపకం దారులకు కోసం రూ.5 వేల కోట్లు, కూరగాయల రైతులను ఆదుకునేందుకు రూ.5 వేల కోట్లతో ప్రత్యేక విధానం తీసుకొస్తున్నామన్నారు.
రైతులు తమ ఉత్పత్తులను.. మెరుగైన ధరకు అమ్ముకునే అవకాశం కల్పించేలా కేంద్రం చట్టం తెస్తోందని.. రాష్ట్రాల మధ్య ఎలాంటి అడ్డంకులు లేకుండా.. మెరుగైన ధరకు రైతులు ఎక్కడైనా అమ్ముకునేలా చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. పంట వేసే సమయంలోనే.. రైతుకు కనీసమద్దతు ధర ఎంతో తెలిసేలా నిర్దిష్ట కార్యాచరణ ఉంటుందన్నారు. నిర్మలా సీతారామన్… అన్నిరంగాలకు.. విడివిడిగా ఏమేం చేస్తామో ప్రకటించారు కానీ నిర్దిష్టంగా ఫలానా రైతులకు.. ఫలానా సాయం అందుతుందనే విషయాన్ని మాత్రం చెప్పలేకపోయారు.