లాక్ డౌన్ విషయంలో మొదటి నుంచి కఠినంగా వ్యవహరించిన తెలంగాణ సీఎం కేసీఆర్ .. ఇప్పుడు పూర్తిగా సడలింపులు ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. కరోనా వైరస్‌పై శుక్రవారం పూర్తి స్థాయిలో సమీక్ష చేసిన కేసీఆర్.. కరోనా వ్యాప్తి తెలంగాణలో లేదన్న అభిప్రాయానికి వచ్చారు. హైదరాబాద్‌లోని నాలుగు జోన్లలో మాత్రమే.. ప్రస్తుతం కేసులు నమోదవుతున్నాయని… తేల్చారు. ఎల్బీ నగర్, మలక్ పేట, చార్మినార్, కార్వాన్ జోన్లలో తప్ప ఎక్కడా యాక్టివ్ కేసులు లేవని అధికారులు వివరించారు. దీంతో.. ఆ నాలుగు జోన్లు తప్ప.. అంతా.. వైరస్ ఫ్రీ అయినట్లుగా ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది.
కొంత మంది వలస కూలీలకు వైరస్ సోకినా… ఆయా జిల్లాలకు వైరస్ విస్తరించినట్లు కాదని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో శనివారం నుంచే మరిన్ని సడలింపులు ఇచ్చారు. ఆటోమోబైల్ షో రూములు, స్పేర్ పార్ట్స్ షాపులు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. ఏసీలు అమ్మే షాపులకు కూడా పర్మిషన్ ఇచ్చారు. ఇతర లాక్ డౌన్ నిబంధనలు యధావిధిగా అమలు చేయాలన్న కేసీఆర్.. ఈ నెల 17తో ముగుస్తున్న దేశ వ్యాప్త లాక్ డౌన్ సందర్భంగా.. కేంద్రం ఇచ్చే మార్గదర్శకాలను పరిశీలించి .. రాష్ట్రంలో అనుసరించే వ్యూహం ఖరారు చేస్తామని చెప్పారు. తెలంగాణలో కరోనా చికిత్సలో మంచి పురోగతి కనిపిస్తోందని ప్రభుత్వం అంచనా వేసింది. కరోనాతో మరణించిన వారి శాతం కేవలం 2.38 మాత్రమే ఉన్నారు. ఇది దేశ సగటు 3.5 శాతం కన్నా తక్కువ. కరోనా వైరస్ ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదని .. కరోనాతో కలిసి జీవించే వ్యూహం అనుసరించక తప్పదని కేసీఆర్ తేల్చేశారు.
వాస్తవానికి హైదరాబాద్‌లో శనివారం నుంచి సిటీ బస్సులు కూడా నడపాలని అనుకున్నారు. కానీ కేంద్రం ఇంకా మార్గదర్శకాలు విడుదల చేయనందున.. రెండు రోజులు ఆగితే మంచిదని.. చివరి క్షణంలో వాయిదా వేసుకున్నారు. పద్దెనిమిదో తేదీ నుంచి కేంద్రం.. ఎలాంటి నిర్ణయం అయినా రాష్ట్రాలకే వదిలేయనుంది. కంటైన్మెంట్ జోన్ల నిర్ణయాధికారం కూడా రాష్ట్రాలకే. కేంద్రం ప్రకటన వచ్చిన తర్వాత తెలంగాణలో దాదాపుగా సాధారణ జన జీవితాన్ని కొద్దిపాటి జాగ్రత్తలతో తీసుకు రావాలని ప్రభుత్వం దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చేసింది.