హైదరాబాద్: తెలుగుదేశంలో చేరబోతున్నట్లు ఈ ఉదయం వచ్చిన వార్తలను వైసీపీ నాయకుడు, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఖండించారు. తాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసిన మాట నిజమేనని, అయితే మైనారిటీ, ముస్లిమ్ గర్జన గురించి మాట్లాడటానికి, మైనారిటీల సమస్యలు వివరించటానికే వెళ్ళానని వివరణ ఇచ్చారు. తాను ముఖ్యమంత్రితో మాట్లాడేటపుడు మున్సిపల్ కమిషనర్, కలెక్టర్ కూడా అక్కడే ఉన్నారని, వారి సమక్షంలోనే మాట్లాడానని చెప్పారు. తాను వైసీపీలోనే కొనసాగుతానని అన్నారు. మరోవైపు వైసీపీ అధికార ప్రతినిధి శ్రీకాంతరెడ్డి మాట్లాడుతూ, టీడీపీ మునిగిపోయే నావ అని, దానిలో ఎవరు చేరతారని వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలెవరూ టీడీపీలో చేరటంలేదని చెప్పారు. టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందని అన్నారు. తెలంగాణలో పార్టీ పరిస్థితినుంచి ప్రజల దృష్టి మరల్చటంకోసం టీడీపీ నాయకులు ఇలాంటి పనులు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కార్యాలయం ఆదేశాల మేరకే ప్రతిపక్షంపై ఎల్లో మీడియాలో వార్తలు వస్తున్నాయని అన్నారు.
అయితే, జలీల్ ఖాన్ టీడీపీలో చేరటంకోసం కలవకపోతే, ఆ భేటీ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన దేవినేని ఉమా, రాష్ట్రమంతా టీడీపీవైపు చూస్తోందని, అనేకమంది వైసీపీ నాయకులు టీడీపీలోకి రాబోతున్నారని ఎందుకు వ్యాఖ్యానించారో అర్థం కావటంలేదు.