వెండి తెరపై తాగుబోతు పాత్రలకు బ్రాండ్ అంబాసిడర్ అక్కినేని నాగేశ్వరరావు. ‘దేవదాసు’తో… తాగుబోతు ఎలా ఉండాలి? ఎలా మాట్లాడాలి? ఎలా నడవాలి? అనే విషయాలకు నిలువెత్తు పాఠంలా మారిపోయారు. నిజానికి మద్యం సేవించడానికి అక్కినేని పూర్తి వ్యతిరేకం. చివరి రోజుల్లో డాక్టర్ల సలహాతో రెండు పెగ్గుల బ్రాందీ తీసుకోవాల్సివచ్చింది. అక్కినేని తొలి పెగ్గు అనుభవం కూడా చాలా గమ్మత్తుగా జరిగింది.
‘నేను సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నా, మద్యానికీ, మగువకు లొంగను’ అని అమ్మమీద ఒట్టు వేసి మరీ… సినిమాల్లోకి వచ్చారు అక్కినేని. అయితే ఓ సందర్భంలో అక్కినేని అమ్మకిచ్చిన మాట తప్పవలసి వచ్చింది. ఆ సంఘటన సినిమాటిక్‌గానే జరిగింది.
అప్పట్లో.. పండగలొచ్చినా, పబ్బాలొచ్చినా సినీ రంగంలో పార్టీలు భారీగా జరుగుతుండేవి. పార్టీలంటే.. మద్యం తప్పని సరి. సరదాగా అందరూ కూర్చుని `చీర్స్` చెప్పుకుంటూ కబుర్లలో పడడం సరదా. అలాంటిపార్టీలకు అక్కినేని కూడా వెళ్లేవారు. కానీ మద్యం ముట్టేవారు కాదు. కారణం.. అమ్మకి ఇచ్చిన మాట. కానీ.. కొన్నిసార్లు మద్యం స్పాన్సర్ చేయాల్సివచ్చేది. ‘హీరోవి కదా.. నువ్వు కూడా మాకు పార్టీలు ఇవ్వాలి..’ అంటూ కొంతమంది దర్శకులు బలవంతం చేసేవారు. అక్కినేనికి ఇవ్వడం తప్పేది కాదు. అలా పార్టీలకు వెళితే అందరికీ మద్యం సరఫరా చేయడం, సోడాలు కలపడం… చేసేవారు అక్కినేని.
ఓ సందర్భంలో కె.ఎస్.ప్రకాశరావు అక్కినేని దగ్గర వెయి రూపాయలు పుచ్చుకున్నారు. మద్యం పార్టీ కోసం. ”ఎలాగూ డబ్బులు ఇచ్చావ్ కదా, నీ పేరు మీద పార్టీ నడుస్తోంది. నువ్వు రావాల్సిందే” అంటూ బలవంతం చేసి పార్టీకి లాక్కెళ్లారు. ”డబ్బులు ఇచ్చి, పార్టీకి వచ్చి మద్యం పుచ్చుకోకపోతే ఎలా…” అంటూ అక్కడున్న కొంతమంది అక్కినేనిని బలవంతం చేశారు. `ఎలాగూ నా డబ్బులే కదా… మద్యం రుచి చూడడంలో తప్పేముంది? అసలు జనాలంతా మద్యం మత్తులో ఎందుకు పడతారు? దాని టేస్ట్ ఎలా ఉంటుంది?` అనిపించింది అక్కినేనికి. దాంతో ఆయన ఓ పెగ్గు పుచ్చుకోవాల్సివచ్చింది. అయితే.. అక్కినేని ని బలవంతం చేసిన దర్శక నిర్మాతల ఆలోచన వేరు. నాగేశ్వరరావుకి ఏఏ హీరోయిన్లతో సంబంధాలున్నాయి? ఎంత మందిని ట్రాప్‌లోకి దించాడు? అనే విషయాలు తెలుసుకోవాలన్న కుతూహలంతో అక్కినేనితో గ్లాస్ పట్టించారు. మద్యం మత్తులో అక్కినేని నిజాలు కక్కేస్తాడని వాళ్ల ఉద్దేశం. ఆ మాస్టర్ ప్లాన్‌కి అక్కినేని గమనించారు. ఓ పెగ్గుకే నిషా ఎక్కేసినట్టు నటించారు. అప్పటికే దేవదాస్ లో నటించిన అనుభవం ఉంది కాబట్టి… తాగుబోతుగా నటించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా పోయింది ఏఎన్నార్‌కు.
”ఇప్పుడు చెప్పవోయ్ నాగేశ్వరరావు.. ఎంతమంది హీరోయిన్లని నీ వెంట తిప్పుకున్నావు” అని అడిగితే..
”నేను అన్నీ నిజాలే చెబుతాను. కానీ ముందు పెద్దవాళ్లు.. మీ సంగతులు బయటపెట్టండి” అనేసరికి.. తాగిన మైకంలో, నాగేశ్వరరావు నిజాలు కక్కేస్తాడన్న నమ్మకంతో… సదరు దర్శక నిర్మాతలంతా తమ చిట్టా విప్పేస్తారు. అవన్నీ ఓపిగ్గా విన్న అక్కినేని ”మీ నుంచి నిజాలు కక్కేందుకే నిషా ఎక్కినట్టు నటించాను. నాకు ఎవరితోనూ ఎలాంటి సంబంధాలు లేవు” అని చెప్పేసరికి మిగిలినవాళ్లంతా ఖంగు తిన్నారు. అక్కినేని తాగుబోతుగా తెరపైనే కాదు బయటా నటించగలడని…. ఈ సంఘటనతో వాళ్లందరికీ తెలిసొచ్చింది. ఈ జ్ఞాపకాలన్నీ అక్కినేని తన ‘మనసులోని మాట’ అనే పుస్తకంలో రాసుకున్నారు.