దశలవారీగా మద్య నిషేధం విధించడానికి సిద్ధమైన ఏపీ సర్కార్.. ఆ ఆదాయలోటును పూడ్చుకోవడానికి లాటరీ టిక్కెట్లను తీసుకురావాలని దాదాపుగా నిర్ణయించుకుంది. ఇప్పటికే అంతర్గతంగా కసరత్తు పూర్తి చేసేసిన తర్వాత.. ఇప్పుడు.. ధరలు ఎలా ఉండాలన్నదానిపై పరిశీలన జరుపుతోంది. ఈశాన్య రాష్ట్రాలతో పాటు..కేరళ రాష్ట్రంలోనూ లాటరీలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో లాటరీల ధరలను పరిశీలించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చినట్లుగా తెలుస్తోంది. లాటరీలకు ధరలు ఎంత నిర్ణయించాలనే దగ్గర్నుంచి.. నిర్వహణ వరకూ.. మొత్తం.. ఓ పద్దతి ప్రకారం… జరిగేలా వ్యవస్థను సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
కేరళలో కూడా.. మద్యంపై నియంత్రణ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2014లో పూర్తి స్థాయి మద్య నిషేధం ప్రకటించారు. అయితే.. తర్వాత లెఫ్ట్ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆర్థిక సమస్యలు వస్తున్నాయని… మద్యనిషేధాన్ని సడలించారు. అయితే.. మద్య నిషేధంతో సంబంధం లేకుండానే కేరళ ప్రభుత్వం లాటరీలను నడుపుతోంది. పెద్ద ఎత్తున ఆదాయాన్ని కూడా పొందుతోంది. ఈ విధానం ఆంధ్రప్రదేశ్ సర్కార్ ను బాగా ఆకట్టుకున్నట్లుగా చెబుతున్నారు. లాటరీలు అమ్మడం ద్వారా మద్యం నియంత్రణ ద్వారా తగ్గే మొత్తాన్ని రాబట్టుకోవచ్చని అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది.
పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం… వాటికి నిధులు సమీకరించుకోవాల్సి ఉంది. ప్రజలపై ఎంత పన్నులు భారం మోపినా.. సరిపోదు. మద్యం స్థాయిలో ఆదాయం వచ్చే వనరు కావాలి. అలా కావాలంటే.. ప్రజలకు మద్యానికి అలవాటు పడినట్లుగా.. వ్యసనంగా మార్చుకోవాలి. లాటరీ టిక్కెట్లే దానికి దగ్గరి దారి అని అంచనాకొచ్చినట్లుగా చెబుతున్నారు. ఏపీలో కూడా గతంలో లాటరీ టిక్కెట్లు ఉండేవి. కానీ పేదలు ఈ లాటరీల వల్ల చితికిపోతున్నారని.. బ్యాన్ చేశారు.