పేద ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఆర్థిక మంత్రి వరుసగా విడుదల చేస్తున్న ప్యాకేజీలు ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేలా లేవన్న అభిప్రాయంతో కాంగ్రెస్ ఉంది. మూడో ప్యాకేజీ ప్రకటించిన తరవాత కేంద్రం నేరుగా ఎవరికీ…నగదు సాయం చేయడం లేదన్న అభిప్రాయానికి వచ్చిన రాహుల్…కేంద్ర ప్రభుత్వం విపక్షాల సలహాలను కూడా తీసుకోవాలని సూచించారు. పేద ప్రజల జేబుల్లోకి డబ్బులు నేరుగా చేరేలా చూడాలని రాహుల్ గాంధీ ప్రధానికి సూచించారు. ఆర్థిక ప్యాకేజి విషయంలో ప్రధాని పునరాలోచించాల్సిన అవసరం ఉందన్నారు.
కరోనా కంటే ఆర్థిక నష్టం మరింత తీవ్రంగా ఉంటుందని … వలస కూలీలు తీవ్ర కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిందేనని రాహుల్ స్పష్టం చేశారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో సమస్యలు పరిష్కరించుకోవాలని .. దేశం మొత్తం వలస కార్మికులకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. భారత్ నిర్మాణంలో వలస కార్మికులు కీలక భాగస్వాములని గుర్తు చేశారు. పేదలకు ప్రత్యక్షంగా నగదు సాయం చేసి.. చిన్న వ్యాపారులకు ప్రకటించిన ప్యాకేజిని నిజాయితీగా అమలు చేస్తేనే ప్రయోజనాలు ఉంటాయన్నారు.
రాహుల్ గాంధీ లాక్ డౌన్ పరిణామాలు.. ఆర్థిక వ్యవస్థకు వచ్చే సవాళ్లు.. తీసుకోవాల్సిన చర్యలపై.. ప్రఖ్యాత ఆర్థికవేత్తలతో కొన్నాళ్లుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సలహాలు తీసుకుంటున్నారు. వాటిని మీడియా ముఖంగా చెబుతూ.. కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నారు. పేదలకు నగదు బదిలీ చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో కదలిక వస్తుందని.. రాహుల్ గాంధీ అభిప్రాయం. అయితే కేంద్రం మాత్రం కొత్తగా ప్రకటిస్తున్న ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీలో.. ఎవరికీ నగదు బదిలీ పథకం ప్రకటించలేదు.