దేశంలో కరోనా లాక్డౌన్ 3.0 నేటితో ముగుస్తోంది. రేపటి నుంచి 4.0 ప్రారంభమవుతుంది. కానీ ఇంత వరకూ కేంద్రం మార్గదర్శకాలను ప్రకటించలేదు. ఈ రోజు.. ఆ మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి లీకయిన సమాచారం ప్రకారం.. మరిన్ని సడలింపులు ఉండబోతున్నాయి. పరిమిత ఆంక్షలతో ప్రజా రవాణా సదుపాయాలు పునరుద్ధరించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రత్యేక రైళ్లను ప్రారంభించారు. ఈ ప్రత్యేక రైళ్లను మరిన్ని ప్రారంభించే అవకాశం ఉంది. అలాగే.. విమానయాన సంస్థలు కూడా కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లలోనూ అన్ని రకాల వ్యాపారాలు, కార్యకలాపాలు ప్రారంభానికి అంగీకరించనున్నారు. అయితే.. రెడ్ జోన్లలోని కంటెయిన్మెంట్ జోన్లలో మాత్రం.. కట్టడి విధిస్తారు.
హాట్స్పాట్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ.. గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లను కేంద్రం ప్రకటిస్తోంది.ఇక నుంచి ఆ అవకాశాన్ని రాష్ట్రాలకే ఇచ్చేస్తోంది. ఆయా జోన్లను రాష్ట్రమే ఎంపిక చేసుకుని కట్టడి చేసుకోవాలని సూచించనుంది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే.. లాక్ డౌన్ విషయంలో.. తమ తమ ఆలోచనలను కేంద్రానికి వెల్లడించాయి. అందరూ విభిన్నమైన ఆలోచనలు చేయడంతో… రాష్ట్రాలకే లాక్ డౌన్ విషయంలో నిర్ణయాలను అప్పగించనున్నారు. కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాల్సిందేనన్న అభిప్రాయంతో ఉన్న ప్రభుత్వాలు కూడా… జాగ్రత్తలు తీసుకునేలా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి.. సాధారణ జన జీవితానికి అలవాటుపడేలా చేయాలనుకుంటున్నారు.
అయితే జనం ఎక్కువగా గుమికూడే కార్యక్రమాలకు అనుమతి ఉండే అవకాశం లేదు. అలాగే సినిమా ధియేటర్లు, మాల్స్‌కు కూడా.. పర్మిషన్ ఇవ్వడం కష్టమేనంటున్నారు. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం.. నిబంధనలు విధించి.. అన్నింటినీ సడలింపులు ఇవ్వాలని భావిస్తున్నారు. కేంద్రం మార్గదర్శకాలను మాత్రమే ప్రకటిస్తుంది. వాటిని అమలు చేయాలా వద్దా అన్నది రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకుంటాయి. అయితే కేంద్రం ఇచ్చిన సడలింపుల కన్నా ఎక్కువ ఇవ్వకూడదు. లాక్ డౌన్ ఎత్తివేత విషయంలో.. రాష్ట్ర ప్రభుత్వాలదే అంతిమ నిర్ణయం కానుంది.