ఓ వైపు జాతీయ రహదారుల వెంట వలస కూలీలు.. పిల్లా పాపలతో మూటలు నెత్తిన పెట్టుకుని నడుచుకుంటూ పోతున్నారు. మరో వైపు అంతరిక్షంలో ప్రైవేటు.. అణ్వాయుధాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గుంచి పాలకులు ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. పారలల్గా జరుగుతున్న ఘటనలు ఇవి. లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది లేని వారు “స్టేహోమ్” నినాదంతో హాయిగా ఇంట్లోనే ఉంటున్నారు. కానీ ఉండటానికి ఇల్లు.. ఉపాధి లేని వారే… ఇంకెన్నాల్లో ఈ దుర్భర జీవితం అని తెలియక ఊళ్లకు నడుచుకుంటూ వెళ్లిపోతున్నారు.
దేశ ప్రజలపై నోట్ల రద్ద తరహా సర్జికల్ స్ట్రైక్ ప్లానింగ్ లేని లాక్డౌన్..!
లాక్డౌన్ ప్రకటించే ముందు… భారత ప్రభుత్వం.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అచ్చంగా నోట్ల రద్దు విషయంలో ఎలాంటి సర్జికల్ స్ట్రైక్ భారత ప్రజలపై జరిగిందో… లాక్ డౌన్ విషయంలోనూ అదే జరిగింది. ఆ దెబ్బకు ఎక్కడివారక్కడే ఉండిపోయారు. పనుల మీద పరాయి ఊరికి వెళ్లిన వారి దగ్గర నుంచి వలస కూలీల వరకూ అందరూ ఎక్కడివారక్కడ ఉండిపోయారు. ఎవరికీ.. సొంత ఊరికి.. సొంత గ్రామాలకు వెళ్లే చాన్సివ్వలేదు. దేశభక్తిని మేళవించిన పిలుపు కావడంతో.. ఎక్కడ దేశద్రోహులంటారోనన్న భయంతో.. చాలా మంది బాధల్ని పంటి బిగువన బిగబట్టి… మొదటి లాక్ డౌన్ పూర్తి చేశారు. కానీ.. అది పూర్తయ్యేది కాదని.. తెలిసే సరికి ఇక ఉండలేకపోయారు. అప్పుడే రైల్వే స్టేషన్ల ముందు వేలాదిగా చేరిన జనాల సమస్యకు ఓ పరిష్కారాన్ని ప్రభుత్వాలు ఆలోచించాల్సింది.
సమస్య తెలిసినా పట్టించుకోని ప్రభుత్వాలెందుకు..?
ప్రభుత్వం హడావుడిగా లాక్ డౌన్ ప్రకటించింది. ఆ లాక్ డౌన్ వల్ల వచ్చే సమస్యలేమిటో గుర్తించలేకపోయింది. కానీ అనుభవమైతేనే తత్వం బోధపడుతుందన్నట్లుగా… లాక్ డౌన్ అమలులో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలిసి వచ్చాయి. అప్పుడైనా … ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సింది. వలస కూలీలు ఊళ్లకు వెళ్లాల్సిన పని లేదని.. ఉపాధి దొరుకుతుందని.. నమ్మకం కలిగించాల్సి ఉంది. ఒక వేళ వారికి ఉపాధి కల్పించలేమని ప్రభుత్వానికే నమ్మకం ఉంటే.. తక్షణం వారిని వారి వారి ఊళ్లకు వెళ్లేలా ఏర్పాట్లు చేసి ఉండాల్సింది. అప్లికేషన్లు పెట్టి ఆన్ లైన్లో అప్లయ్ చేసుకుని ఊళ్లకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకునేంత సామర్థ్యం వలస కార్మికులకు ఉండదు. అలా ఆలోచించడే ఆవాగాహనా రాహిత్యం. ఎక్కడెక్కడ వలస కూలీలు ఉన్నారో తెలుసుకుని ప్రభుత్వాలే..వారిని ఊళ్లకు పంపే ఏర్పాట్లు చేయాల్సి ఉంది. కానీ అలాంటి ఆలోచన చేయనే లేదు. అరకొరగా వేసిన శ్రామిక్ రైళ్లు.. ఒక్క శాతం కార్మికులకు సరిపోలేదు. అసలు వాటిసమాచారమే వారికి తెలియకపోవడంతో.. వినియోగించుకున్న వారు కూడా తక్కువే.
నడుస్తూ పోతున్న ప్రాణాలు… భారత అభివృద్ధి మేడిపండు అని చెబుతున్న సాక్ష్యాలు..!
అభివృద్ధి అంటే బుల్లెట్ ట్రైన్లు… మహా నగరాలు.. పెద్ద పెద్ద భవనాలు… విలాసవంతమైన జీవితం అనుకునే పరిస్థితి పాలకులకు వచ్చింది. కానీ అభివృద్ధి అంటే.. ప్రజలందరూ సమానంగా ఫలాలు అనుభవించడం. అందరికీ మెరుగైన జీవితం అందించడం. అందరి జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం. వలసకూలీలకు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో రేషన్ తప్ప ఏమీ లేదు. వారికి భరోసా ఇచ్చే ఒక్క ప్రకటన లేదు. ఉపాధి హామీ పథకం ఎప్పటి నుంచో ఉంది. అయినా వలస వచ్చారు కదా..! హైవేల మీద నడుస్తూ.. ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారు.. భారత దేశ పేదరికానికి సాక్ష్యాలు. ఎదురుగా కనిపించే భారీ భవంతులు.. మెట్రో ట్రైన్లు.. అన్నీ మిథ్య. పాలకులు.. ఎప్పుడు సమానత్వం అలవాటు చేసుకుంటారో అప్పటి వరకూ.. భారతదేశం కనీసం అడుగు కూడా ముందుకు వేయదు. ముందుకు వేసినట్లు అనుకుంటారు కానీ.. పడేది వెనక్కి అడుగులే..!