తెలంగాణలో కరోనా కేసులు పెరగకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా మూడు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి రాకపోకల్ని పూర్తిగా నిషేధించారు. ఈ మూడు రాష్ట్రాల్లో మహారాష్ట్ర,గుజరాత్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. గుజరాత్, మహారాష్ట్రల్లో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అయితే ఏపీలో మాత్రం.. పరిస్థితి మరీ అంత దారుణంగా ఏమీ లేదు. వలస కూలీలు, కోయంబేడు మార్కెట్ తో సంబంధం ఉన్న కేసులే నమోదవుతున్నాయి. అయినప్పటికీ..ఏపీ నుంచి రాకపోకల్ని తెలంగాణ సర్కార్ నిషేధించడమే ఆశ్చర్యకరంగా మారింది.
ఏపీలో తెలంగాణకు చెందిన పలువురు వలస కార్మికులు ఉన్నారని వారిని తెలంగాణకు పంపిస్తామంటే….తెంలగాణ ప్రభుత్వం స్పందించడం లేదని..హోంమంత్రి సుచరిత వ్యాఖ్యానించిన రోజే.. తెలంగాణ సర్కార్ ఏపీ నుంచి రాకపోకలు నిషేధించడం ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్రలో పరిస్థితి తీవ్రంగా ఉంది. తెలంగాణతో మహారాష్ట్రకు సరిహద్దు ఉంది. ఈ మేరకు.. ఆ రాష్ట్రం నుంచి రాకపోకల్ని నిషేధించినా ఓ అర్థం ఉంది. కానీ ఏపీ నుంచి రాకపోకల్ని నిషేధించడం మాత్రం కాస్త ఆశ్చర్యకరమేనంటున్నారు.
లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తున్న సమయంలో… ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే వాళ్లు కూడా ఎక్కువే ఉన్నారు. తెలంగాణతో సరిహద్దు లు ఉన్న జిల్లాలు గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కరోనా తీవ్రంగా ఉందని.. అందుకే..వారి ఆ రాష్ట్రం నుంచి రాకపోకల్ని నిషేధిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ పోలీసులు పాస్‌ల జారీని నిలిపివేశారు. ప్రజా రవాణాకు అనుమతి ఇచ్చే వరకూ..ఈ నిషేధం కొనసాగే అవకాశం ఉంది.