ఎందుకో ఈమధ్య నాగ అశ్విన్ ట్వీట్లు తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇది వరకెప్పుడూ ట్విట్టర్లో ఇంత స్పీడుగా లేడు ఈ దర్శకుడు. ఇప్పుడు మాత్రం `థియేటర్ల ఆక్యుపెన్సీ ఎలా పెంచుకోవాలి` అనే పాయింటు మీద తెగ ఐడియాలు ఇస్తున్నాడు. థియేటర్లో బ్రీజర్, బీర్, వైన్ అమ్మితే ఎలా ఉంటుంది? అంటూ తొలిసారి ఓ ట్వీట్ చేశాడు. ఈ ఆలోచన తీవ్ర విమర్శలకు గురి అవుతోంది. మద్యం సరఫరా చేస్తే దాన్ని బార్ అంటారు గానీ, థియేటర్ అని ఎందుకు అంటారు? అంటూ ఎకసెక్కాలు ఆడేశారు. సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్‌కి మరింత దూరం చేస్తారా? అంటూ రివర్స్ లో కామెంట్లు గుప్పించారు.
ఇప్పుడు మరో ఆలోచనతో ముందుకొచ్చాడు నాగ అశ్విన్. ”కార్లో, సొంత వాహనాల్లో కూర్చుని సినిమాని ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుంది? ఇది పాత ఐడియానే. టూరింగ్ టాకీస్ టైపులో..” అంటూ ఓ ట్వీట్ చేశారు. దీనిపైనా భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది పాత ఐడియా అయినా వర్కవుట్ అవుతుంది, గోల్డెన్ మూవీస్‌ని ఇలా చూస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు – అని కొంతమంది సమర్థించారు. అయితే ఇంకొంత మంంది మాత్రం నాగ అశ్విన్‌ని ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు.
”నువ్వేదో తెలివైనవాడివి అనుకున్నాం.. ఇలాంటి ఐడియాలు వస్తున్నాయేంటి” అని ఓ నెటిజన్ స్పందిస్తే… ”ప్రభాస్ సినిమాని కూడా ఇలానే చూపిస్తావా” అంటూ ఇంకొకరు సెటైర్వేశారు. ప్రభాస్ సినిమాపై దృష్టి పెట్టమని, ఇలాంటి ఆలోచనలు కట్టిపెట్టమని నాగ అశ్విన్ కి సలహా ఇస్తున్నారు. ముందు టికెట్టు రేట్లు తగ్గించాలని, థియేటర్లలో ఎం.ఆర్.పీ ధరకు తిను బండారాలను అందించాలని, అవి నాణ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, అప్పుడు కచ్చితంగా ప్రేక్షకులకు థియేటర్లకు రావడానికి సిద్ధ పడతారని, ఇలాంటి చీప్ ట్రిక్కులకు ఎవరూ పడిపోరని ఘాటైన కామెంట్లు చేస్తున్నారు.