ఇంగ్లిష్ మీడియం విషయంలో ఏపీ సర్కార్ వ్యూహాలు పరిధులు దాటిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పేదలకు ఇంగ్లిష్ వద్దా..? మీ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు..? అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర్నుంచి అందరూ.. రాజకీయ పరమైన విమర్శలను ఎదుటి పార్టీల నేతలపై చేస్తున్నారు. అయితే.. అది రాజకీయం కాబట్టి సహజమే అనుకోవచ్చు. తాజాగా.. బాపట్ల ఎంపీ నందిగం సురేష్.. ఇదే డైలాగ్‌ను.. న్యాయవ్యవస్థపై సంధించారు. వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో… న్యాయమూర్తులపైనా వ్యాఖ్యలు చేశారు నందిగం సురేష్. తీర్పులు ఇచ్చే న్యాయమూర్తులు ఏ మీడియంలో చదువుతున్నారని ప్రశ్నించారు. ఇలా ప్రశ్నించడానికి ముందు.. చంద్రబాబు అన్నీ అడ్డుకుంటున్నారని ఆరోపణలు గుప్పించారు.
నిర్బంధ ఇంగ్లిష్ మీడియం పేరుతో తెలుగు మీడియాన్ని ఏపీ సర్కార్ నిషేధించడంపై.. కోర్టుల్లో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. రాజ్యాంగం ప్రకారం.. విద్యా హక్కు చట్టం ప్రకారం మాతృభాషలో విద్యాబోధనను నిషేధించడం సరి కాదని కోర్టు తీర్పు చెప్పింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను కొట్టివేసింది. ఏ మీడియంలో చదవలాన్నది తల్లిదండ్రులు, పిల్లల ఇష్టమని చెప్పింది. ప్రభుత్వం కూడా ఈ మేరకు స్కూళ్లలో ఆప్షన్ పెడితే సరిపోయేది. కానీ తెలుగు మీడియంను ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాన్ చేసి..నిర్బంధంగా అందరూ ఇంగ్లిష్ మీడియంలో మాత్రమే చేరాలనుకునేలా వ్యూహాన్ని సిద్ధం చేసుకుంది. కోర్టు జీవోను కొట్టివేసినా.. తనదైన ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.. ఎస్సీఈఆర్టీ ద్వారా మరోసారి అలాంటి సిఫార్సే చేయించింది. ఆ మేరకు ఇంగ్లిష్ మీడియంకు సిద్ధమయింది.
విద్యాహక్కు చట్టానికి ఈ ప్రయత్నాలు విరుద్ధంగా ఉన్నాయని మళ్లీ న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతోనే వైసీపీ.. ఇలా రాజకీయంగా ఎదురుదాడికి దిగుతున్నట్లుగా భావిస్తున్నారు. సాధారణంగా వైసీపీ ఎంపీలు ఎవరూ వ్యక్తిగత ప్రకటనలు చేయరు. వైసీపీ ఆఫీసులో కూర్చుని ప్రెస్‌మీట్ పెట్టారంటే..అది రాసి ఇచ్చినదే అవుతుందని చెబుతారు. నందిగం సురేష్.. ఇలాంటి వాటిపై అసలు వ్యాఖ్యలు చేయరు. వ్యూహాత్మకంగానే .. రిజర్వుడు నియోజకవర్గానికి చెందిన ఎంపీతో వైసీపీ పెద్దలు వ్యూహాత్మకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయించారని తెలుస్తోంది.