తెలంగాణలో మంగళవారం నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. అంతర్రాష్ట్ర జిల్లా సర్వీసులు.. అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్కు రాకపోకలు.. ఇక సాధారణం కానున్నాయి. అయితే.. మొదటగా.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అక్యూపెన్సీని యాభై శాతానికి మాత్రమే పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయి. కండక్టర్లు లేకుండా.. బస్సు ఎక్కేటప్పుడే టిక్కెట్ తీసుకునే విధానాన్ని ప్రవేశపెట్టి.. బస్సుల్ని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని నిర్ణయించారు. లాక్ డౌన్ నిబంధనలు ఎలా అమలు చేయాలన్నదానిపై మంత్రివర్గం అధికారికంగా నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే బస్సులను మళ్లీ రోడ్డెక్కించడంపై ఓ ప్రాథమిక నిర్ణయానికి వచ్చారు. ఆర్టీసీ బస్సులు దాదాపుగా రెండు నెలలుగా డిపోలకే పరిమితమయ్యాయి.
వలస కూలీల్ని తరలించడానికి కొన్ని బస్సుల్ని ఇటీవల నడుపుతున్నప్పటికీ.. అవి ఫ్రీ సర్వీసే. ఆదాయపరంగా.. రెండు నెలల నుంచి పూర్తిగా ఆర్టీసీకి నష్టం వస్తోంది. ఇంకా ఆలస్యం జరిగితే.. ఆర్టీసీకి మరిన్ని ఆర్థిక పరమైన కష్టాలు వస్తాయన్న అంచనాలో ఉన్నారు. కేంద్రం ఇప్పటికే బస్సు సర్వీసుల ప్రారంభానికి అనుమతి ఇచ్చినందున.. జోన్ల వారీగా.. బస్సులు నడపడానికి ఇబ్బంది ఉండనే నిర్ణయానికి వచ్చారు. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల నిర్ణయాన్ని కూడా.. రాష్ట్రాలకే కేంద్రం వదిలి పెట్టింది. అంటే.. ఓ రకంగా.. ఎలాంటి సడలింపులు ఇవ్వాలన్నది పూర్తి స్థాయిలో రాష్ట్రాల ఇష్టం.
తెలంగాణ ప్రభుత్వ పెద్దలు.. కరోనాతో జీవించాల్సిందేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కంటెయిన్మెంట్ జోన్లు మినహా.. మిగతా అన్ని చోట్ల.. సాధారణ కార్యకలాపాలకు ఇప్పటికే అనుమతి ఇచ్చారు. కేబినెట్ భేటీ తర్వాత… కంటెన్మెంంట్ జోన్లు మినహా.. మిగతా అన్ని చోట్లా.. భౌతిక దూరం పాటిస్తూ… నిరంతరాయంగా కార్యకలాపాలు నిర్వహించే అవకాశం కల్పిస్తారని చెబుతున్నారు.