తమిళ నాట సూర్యకీ ఎగ్జిబీటర్స్కీ మధ్య వివాదం ముదురుతుంది. ఇరు పక్షాలూ ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. దానికి కారణం.. సూర్య తన సినిమాని నేరుగా ఓ టీ టీలో విడుదల చేసుకోవాలని చూడడమే. జ్యోతిక ప్రధాన పాత్రలో ‘పొన్ మగల్ వంధాల్’ అనే చిత్రం తెరకెక్కింది. దీనికి సూర్య నిర్మాత. ఈ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ లో విడుదల చేయాలని సూర్య నిర్ణయించుకున్నారు. అయితే ఈ నిర్ణయం పట్ల థియేటర్ యాజమాన్యాలు అభ్యంతరం తెలిపాయి. భవిష్యత్తులో సూర్య సినిమాల్ని తాము అడ్డుకుంటామని బెదిరించాయి. ఓటీటీకి అమ్ముకుంటే.. థియేటర్ల మనుగడ ఎలా సాధ్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశాయి.
అయితే ఈ బెదిరింపులకు సూర్య భయపడడం లేదు. ఎన్ని రకాల హెచ్చరికలు చేసినా.. ‘నా సినిమాని ఓటీటీలోనే విడుదల చేస్తాను. అడ్డుకునే ధైర్యం ఎవరికి ఉందో నేనూ చూస్తాను’ అని సవాల్ విసిరారు. అంతేకాదు… ఓ నిర్మాతగా తన సినిమాని ఎప్పుడు ఎక్కడ ఎలా విడుదల చేసుకోవాలన్న హక్కు తనకు ఉందని, థియేటర్లు ఎప్పుడు తెరచుకుంటాయో తెలియని పరిస్థితి ఉందని, తన సినిమాని విడుదల చేయకుండా ఆపేస్తే.. అప్పులు పెరిగిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ”సినిమా ఫ్లాపయి, నష్టాలొస్తే ఆదుకోవడానికి ఎవరూ ముందుకు రారు. నాకు అసలే చాలా అప్పులు ఉన్నాయి. వాటిని థియేటర్ యజమానులు తీరుస్తారా” అని సూటిగా ప్రశ్నించారు. ఈ చిత్రం ఈనెల 29న నేరుగా అమేజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.