ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రాల్లోని మెట్రో సిటీల్లో ఇరుక్కుపోయిన ఆంధ్రులు ఇక క్వారంటైన్ భయం లేకుండా… ఏపీకి రాకపోకలు సాగించే అవకాశం లభించబోతోంది. మూడు, నాలుగు రోజుల్లో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. హైదరాబాద్, బెంగళూరు,చెన్నై నుంచి కూడా ఏపీకి రావాలనుకునేవారి కోసం బస్సుల్ని తిప్పనున్నారు. ప్రైవేటు బస్సు ఆపరేటర్లను కూడా అనుమతించనున్నారు. కేంద్రం లాక్ డౌన్ పొడిగిస్తూ.. ఇచ్చిన నిబంధనలపై జగన్ సమీక్ష నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
బస్టాండ్ నుంచి బస్టాండ్ వరకూ సర్వీసులు నడిపాలని.. మధ్యలో ఎవరినీ ఎక్కించుకోకుండా… పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించిన తర్వాతే ప్రయాణించేలాచేయాలని నిర్దేశించారు. అంతర్రాష్ట్ర సర్వీసులే కాకుండా… రాష్ట్రంలో కూడా బస్సులు నడపాలని నిర్ణయించారు. మూడు నాలుగు రోజుల్లో బస్సు సర్వీసుల ప్రారంభ తేదీని ఖరారుచేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపులన్నీఏపీలో అమలు చేయనున్నారు. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు మెరుగవ్వాలన్న లక్ష్యంతో జగన్ ఉన్నారు. రెడ్ జోన్లు మినహా.. మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే సడలింపులు ఇచ్చారు.
పలు క్లస్టర్లలో చాలా రోజులుగా కేసులు నమోదు కావడం లేదు. వాటన్నింటినీ రీ నోటిఫై చేసుకునే అధికారం రాష్ట్రాలకే కేంద్రం ఇవ్వడంతో.. ఈ మేరకు.. రాష్ట్రంలో కూడా రెడ్ జోన్లను తగ్గించే అవకాశం ఉంది. కంటెన్మెంట్ జోన్లకే ఆంక్షలు పరిమితంచేసి.. సాధారణ జనజీవనం ప్రారంభమయ్యేలా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.