కర్ణాటక కూడా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభించాలని నిర్ణయించింది. అయితే నాలుగు రాష్ట్రాల నుంచి మాత్రం రాకపోకలపై నిషేధం విధించింది. ఆ నాలుగు రాష్ట్రాల్లో పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లేదు. ఏపీ మరో పొరుగు రాష్ట్రం తెలంగాణ ఆంధ్ర నుంచి రాకపోకల్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ స్థాయిలోనే బెంగళూరుకు ఏపీ వాసులు రాకపోకలు సాగిస్తారు. అయినప్పటికీ.. కర్ణాటక ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడుతో పాటు.. తమతో సరిహద్దు ఉన్న మరో రాష్ట్రం కేరళ నుంచి కూడా బస్సుల్ని అనుమతించకూడదని కర్ణాటక నిర్ణయం తీసుకుంది.
నిజానికి కేరళలో కరోనాను.. పూర్తిగా కంట్రోల్ లో ఉంచారు. ఆ రాష్ట్రం పై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కూడా కురిసింది. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం వలస కూలీలు, విదేశాల నుంచి వస్తున్న వారి వల్ల మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. అయినప్పటికీ..అక్కడ వంద మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నాయి. కానీ ఆంధ్రకు రాకపోకలు అనుమతించిన కర్ణాటక .. కేరళకు మాత్రం వద్దనుకుంది. కర్ణాటక.. లాక్ డౌన్ నిబంధనల్లో పూర్తి స్థాయి సడలిపులు ఇస్తోంది. ఓలా, ఉబెర్ క్యాబ్ సర్వీసులకు కూడా అంగీకారం తెలిపింది.
ఆదివారం మాత్రం కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు. అన్ని రకాల వ్యాపారాలకు పూర్తి స్థాయిలో అనుమతి ఇస్తున్నారు. కేంద్రం నిషేధిత జాబితాలో పెట్టిన వాటికి మాత్రం పర్మిషన్ లేదు. కర్ణాటకలో మొదట్లో కేసులు ఎక్కువగా నమోదైనప్పటికీ..తర్వాత కంట్రోల్ అయ్యాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఆరు వందల యాక్టివ్ కేసులు ఉన్నాయి.