తెలంగాణలో కరోనా వైరస్ టెస్టులు తక్కువగా చేస్తూండటంపై హైకోర్టు సీరియస్ అయింది. ఎన్ని టెస్టులు చేశారో వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సూర్యాపేట జిల్లాలో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతూండగానే హఠాత్తుగా..టెస్టుల్ని నిలిపివేశారు. తర్వాత ఒక్క కేసు కూడా నమోదు కావడం లేదని చెప్పి గ్రీన్ జోన్‌గా ప్రకటించారంటూ బీజేపీ నేత సంకినేని వరుణ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సూర్యాపేటలో అసలు టెస్టింగ్ చేయకుండా ఫ్రీజోన్‌గా ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్నించింది.
వలస కూలీలు రాష్ట్రంలోకి వస్తున్నారు… కేసులు పెరిగే అవకాశం ఉందని … ప్రైవేట్ ల్యాబ్‌లకు అనుమతించి… కేరళ మాదిరిగా మొబైల్ టెస్టింగ్ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో టెస్టింగ్ సంఖ్య తక్కువగా ఉందని.. టెస్టుల పూర్తి వివరాలు సమర్పించాలని స్పష్టంచేసింది. తదుపరి విచారణ ఈ నెల 26కు వాయిదా వేసింది. తెలంగాణ సర్కార్ దేశంలోనే అతి తక్కువ టెస్టులు చేసిన రాష్ట్రంగా ఉంది. కేసులు తక్కువ నమోదవుతున్నాయని చెప్పుకునేందుకు టెస్టులు చేయడం నిలిపివేసిందనే ఆరోపణలు విపక్షాల నుంచి వస్తున్నాయి. జాతీయ మీడియా ప్రతినిధులు ఇదే అంశాన్ని లేవనెత్తారు.
కొద్ది రోజుల క్రితం..కోర్టు దీనిపై ప్రశ్నించడంతో..ఆ తర్వాత టెస్టుల సంఖ్యను పెంచారు. అప్పట్నుంచి మళ్లీ రోజుకు 40, 50 కేసులు నమోదవుతున్నాయి. కేరళ తరహాలో టెస్టులు చేయాలని హైకోర్టు ఆదేశించడంతో తెలంగాణ సర్కార్… ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. తాము ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారమే.. టెస్టులు చేస్తున్నామని తెలంగాణ సర్కార్ వాదిస్తోంది.