కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ పచ్చి మోసమని తెలంగాణ సీఎం కేసీఆర్ తేల్చేశారు. కేంద్రం ఇస్తామన్న సాయానికి అనేక షరతులు పెట్టారని.. అన్ని షరతులు పెట్టి ఇచ్చేది రూ.2500 కోట్లేనని.. ఆ ముష్టి సొమ్ము తమకు అవసరం లేదని తేల్చేశారు. కేంద్రం పెట్టిన షరతుల్లో వన్ నేషన్ – వన్ రేషన్, టీఎస్‌బీపాస్ ఎప్పటి నుంచో ఉన్నాయని.. విద్యుత్ సంస్కరణలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయబోమని స్పష్టం చేశారు. రుణాలు ఇవ్వడానికి కేంద్రం షరతులు పెట్టిందని.. రాష్ట్రాలు కట్టుకునే అప్పుకు.. కేంద్రం షరతులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్రం ప్యాకేజీ ఉత్త బోగస్ అని.. అంతర్జాతీయ బిజినెస్ జర్నల్స్ కూడా రాశాయని.. కేంద్రం తన పరువును తానే తీసుకుందని కేసీఆర్ స్పష్టం చేశారు. అన్నీ కేంద్రమే చెబితే.. ఇక రాష్ట్రాలు ఎందుకని.. కేసీఆర్ ప్రశ్నించారు. తాము అడిగిన ప్యాకేజీ అది కాదని.. రాష్ట్రాలకు నేరుగా నగదు సాయం చేయాలన్నారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాలు సబార్డినేట్లు కావన్నారు. మంత్రివర్గ సమావేశం తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
గోదావరి నీటిని సీమకు తీసుకెళ్లండి..!
ఏపీతో ఏర్పడిన జల వివాదాలపై కేసీఆర్ .. సమయం చూసి స్పందిస్తామని వ్యాఖ్యానించారు. పోతిరెడ్డిపాడుపై ఎవరు ఉద్యమించారో అందరికీ తెలుసుని వ్యాఖ్యానించారు. రాయలసీమకు నీళ్లు వెళ్లాలని.. గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయని.. వాటిని తీసుకెళ్లాలని సలహా ఇచ్చానని చెప్పుకొచ్చారు. ఏపీ సర్కార్.. కేఆర్ఎంబీకి..గోదావరి రివర్ బోర్డుకు రాసిన లేఖల విషయాన్ని ప్రస్తావించారు. ఏపీ ఇప్పుడే లేఖలు రాసిందని.. అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. ఏపీతో వివాదాలకు పోదల్చుకోలేదని.. తమ ప్రాజెక్టులన్నీ చట్టం ప్రకారమే.. నిర్మితమవుతున్నాయన్నారు. చట్ట పరిధిలో తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తామన్నారు. రాయలసీమకు గోదావరి నీటిని తీసుకెళ్లాలని.. తెలంగాణ ప్రయోజనాలకు భంగం వాటిల్లితే మాత్రం సహించబోమన్నారు. గోదావరి జలాల్లో నికర జలాలే కాకుండా మరో 650 టీఎంసీల మిగుల జలాల తెలంగాణకు ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
తెలంగాణ మొత్తం గ్రీన్ జోనే..!
తెలంగాణలో లాక్ డౌన్ విషయంలోకేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం నిర్ణయం మేరకు తెలంగాణ మే 31 వరకు పొడిగించారు. అయితే.. దాదాపుగా తెలంగాణ మొత్తాన్ని గ్రీన్ జోన్‌గా ప్రకటించారు. 1400 ఇళ్లు మాత్రమే కంటెన్మెంట్ జోన్ల పరిధిలో ఉన్నాయని.. అవి తప్ప తెలంగాణ మొత్తం గ్రీన్ జోన్‌గా తేల్చేశారు. హైదరాబాద్‌లో సిటీ బస్సులు.. అంతర్రాష్ట్ర సర్వీసులు మినహా.. ఆర్టీసీ బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అన్ని రకాల వ్యాపారాలకు అనుమతి ఇచ్చారు. హైదరాబాద్‌లో మాత్రం సరిబేసి విధానాన్ని అమలు చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులన్నీ పని చేస్తాయని.. ఈ కామర్స్.. క్యాబ్ సర్వీసులకు కూడా వంద శాతం అనుమతి ఇస్తున్నట్లుగా ప్రకటించారు. కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలని ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.
చెప్పిన పంట వేసిన వారికే రైతు బంధు..!
నియంత్రిత వ్యవసాయ విధానంపైనా మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చెప్పిన పంట వేసిన రైతులకు మాత్రమే.. రైతు బంధు పథకాన్ని అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. డిమాండ్ ఉన్న పంటలు వేసుకుంటేనే…రైతులకు లాభం ఉంటుందన్నారు. రైతుల తలరాత వాళ్లే రాసుకోవాలని.. తెలంగాణలో రైతులు అప్పుల పాలు కావొద్దని కేసీఆర్ కోరారు. త్వరలో న్యూస్ఛానల్లో రైతులతో ముఖాముఖి నిర్వహిస్తానని ప్రకటించారు.