భారత్లో కరోనా పాజిటివ్ కేసులు లక్ష దాటిపోయాయి. రెండు నెలల లాక్డౌన్ తర్వాత కూడా ఇప్పుడు రోజుకు ఐదు వేల కేసులు నమోదవుతున్నాయి. మరణాల్లోనూ రోజువారీ రికార్డు నమోదవుతోంది. ఇప్పటికి మూడు వేల మంది చనిపోయారు. మామూలుగా అయితే.. లాక్ డౌన్ విధిస్తే.. కేసులు కంట్రోల్ కావాలి. కానీ.. పెరుగుతున్నాయి. లాక్ డౌన్ వేయకపోతే.. భయంకరంగా ఉండేందటూ.. ఇతర దేశాలను చూపించి భయపెడుతున్నారు కానీ… లాక్ డౌన్ విధించిన తర్వాత … ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చుకున్న తర్వాత కూడా.. ఎందుకు కరోనాను కట్టడి చేయలేకపోయారన్నది ఇప్పుడు… చర్చనీయాంశంగా మారుతోంది.
భారత్లో జనవరి 30న తొలి కరోనా కేసు నమోదైంది. మార్చి నాటికి కేసుల సంఖ్య పెరగడం ప్రారంభమైంది. మార్చి 15న వంద కేసులు నమోదు కాగా.. మార్చి 28కి వెయ్యి మందికి,ఏప్రిల్ 7న ఐదు వేల మందికి, ఏప్రిల్ 14న పది వేల మందికి, ఏప్రిల్ 22న ఇరవై వేల మందికి, ఏప్రిల్ 29న 30 వేల మందికి వైరస్ సోకింది. మే 6 నాటికి యాభై వేల కేసులు,మే 13 నాటికి 75 వేల కేసులు నమోదయ్యాయి. గత ఆదివారం ఏకంగా ఐదు వేల మందికి సోకడంతో కరోనా వేగం పుంజుకున్నట్లయ్యింది. ప్రతీ రెండు నుంచి మూడు రోజుల వ్యవధిలో పది వేల కేసులు నమోదవుతున్నాయి. దేశంలోని కరోనా కేసుల్లో అత్యధికం మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడులో నమోదవుతున్నాయి. 20 జిల్లాల్లోనే 68 శాతం కేసులు నమోదవుతున్నాయి.
రోజు రోజుకు కరోనా కేసులు కొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. అయినప్పటికీ.. లాక్ డౌన్ సడలింపులు ఇస్తూ పోతున్నారు. నాలుగో సారి లాక్ డౌన్ కొనసాగించినప్పటికీ రాకపోకలపై చాలా వరకు నిషేధం ఎత్తివేయడంతో వచ్చేపోయే జనం వైరస్ వాహకాలుగా మారిపోతారన్న భయం వెంటాడుతోంది. చాలా మందికి వైరస్ వెంటనే బైటపడదు. కొందరికీ వైరస్ అసలే బైటపడదు. వారి నుంచి మాత్రం పదుల సంఖ్యలో జనానికి వైరస్ సోకుతుంది. ఇప్పుడు ప్రయాణాలను అనుమతిస్తే సూపర్ స్పైడర్స్ వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కానీ కరోనాతో జీవించక తప్పని పరిస్థితి ఏర్పడింది.