కేసీఆర్‌తో పెట్టుకోలేవు..!.. అంటూ కేసీఆర్ నేరుగా.. మీడియా ప్రతినిధికు వార్నింగ్ ఇచ్చేశారు. ఇది ఒక్క సారి కాదు ప్రతీ సారి ఆయన మీడియా ప్రతినిధులపై విరుచుకుపడటం కామన్ అయిపోయింది. రాహుల్ అనే రిపోర్టర్‌పై కేసీఆర్ ఒంటి కాలి మీద లేస్తున్నారు. ఆయన ఏ ప్రశ్న అడిగినా సరే..నేరుగా సమాధానం చెప్పకపోగా.. ఆయనను చులకన చేసే విధంగా మాట్లాడుతున్నారు. తనకు ఇష్టం లేని ప్రశ్నలు వేస్తే.. ఇతర రిపోర్టర్లపైనా కేసీఆర్ అదే అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇదే జర్నలిస్టు సర్కిళ్లలో చర్చనీయాంశం అవుతుంది.
కేసీఆర్ సాధారణంగా ప్రెస్మీట్లు పెట్టరు. కానీ కరోనా కారణంగా ఆయన ఫుల్ యాక్షన్‌లోకి వచ్చేశారు. రోజూ రివ్యూలు చేస్తున్నారు. వారానికి రెండు, మూడు సార్లు మీడియా ముందుకు వస్తున్నారు. అంతకు ముందు నెలల తరబడి ఆయన ప్రెస్‌మీట్ ఉండేది కాదు. అయితే.. ఈ కరోనా ప్రెస్మీట్లలో తాను చెప్పాలనుకున్నదంతా చెప్పిన తర్వాత మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడుగుతున్నప్పుడే..కేసీఆర్ కంట్రోల్ తప్పి పోతున్నారు. గతంలో రాహుల్ అడిగిన ఓ ప్రశ్నకు చిరాగ్గా ఫేస్ పెట్టి ” అయితే.. ఏం చేద్దామంటవయ్యా..?” అంటూ.. స్పందించిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత కూడా ప్రతీ ప్రెస్‌మీట్‌లోనూ జర్నలిస్టులపై ఆయన విరుచుకుపడుతూనే ఉన్నారు.
మామూలుగా.. మీడియాతో కేసీఆర్ ఇలా వ్యవహరించిన సందర్భాలు పెద్దగా లేవు. కానీ ఇప్పుడే ఆయన ఎందుకు అసహనానికి గురవుతున్నారో మీడియా ప్రతినిధులకే అర్థం కావడం లేదు. దాదాపుగా ప్రతీ ప్రెస్‌మీట్‌లోనూ ఆయన తాను సీరియస్‌గా చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తూ ఉంటారు. ఆ చర్యలు మీడియా ప్రతినిధులపైనే అన్న అర్థం వచ్చేలా ఉంటాయి. తప్పుడు వార్తలు రాస్తున్నారని.. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని.. అంటూ ఉంటారు. ఓ సారి ఆంధ్రజ్యోతిపై ఫైరయ్యారు. దానికి రాధాకృష్ణ కూడా కౌంటర్ ఇచ్చారు. తర్వాత అది సద్దుమణిగిపోయింది. ప్రెస్మీట్లలో కేసీఆర్‌కు ఎక్కడ కోపం వస్తుందో అని చాలా మంది ప్రశ్నలు అడగడం కూడా మానేస్తున్నారు. ఈ ఎఫెక్ట్ కోసమే కేసీఆర్ అలా ఆగ్రహం చూపిస్తున్నారేమోనన్న అభిప్రాయం కూడా.. జర్నలిస్టుల్లో వ్యక్తమవుతోంది.