కొన్ని పాటలు.. భలే పుట్టేస్తుంటాయి. ఆ పాటల కంటే… ఆ పాట పుట్టుక వెనుక ఉన్న కథ గమ్మత్తుగా ఉంటుంది. ‘బలిపీఠంలో’ ‘కుశలమా.. మీరు కుశలమేనా’ అనే పాట వెనుక కూడా ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ ఉంది.
శోభన్ బాబు, శారద జంటగా నటించిన చిత్రం `బలిపీఠం’. దాసరి దర్శకుడు. పాటలన్నీ రెడీ అయిపోయాయి. కానీ ఒక్క పాట బాకీ. శోభన్ బాబు – శారదల మధ్య డ్యూయెట్ కోసం కుస్తీలు జరుగుతున్నాయి. చక్రవర్తి ఓ ట్యూన్ సిద్ధం చేశారు. గీత రచయిత దేవుల పల్లి కృష్ణశాస్త్రికి మాత్రం ఎంతకీ దానికి తగ్గ పదాలు దొరకడం లేదు. అప్పటికి ఆయనకు నోటి కాన్సర్. నోట్లోంచి మాట కూడా సరిగా రావడం లేదు. అందుకే ఆయన దగ్గర ఓ నోట్ బుక్ ఉంచుకునేవారు. ఏం చెప్పాలన్నా.. అందులో రాసి చూపించేవారు.
రోజులు గడుస్తున్నాయి. కానీ కృష్ణశాస్త్రి నుంచి పాట రావడం లేదు. రాస్తే.. తప్పకుండా గొప్ప పాటే రాస్తారు కాబట్టి.. ఆయన్నీ ఏమీ అనలేకపోతున్నారు దాసరి. ఆయన్నుంచి పాట ఎప్పుడొస్తుందా అని చక్రవర్తి, దాసరి ఇద్దరూ ఎదురుచూస్తున్నారు.
ఓరోజు కృష్ణశాస్త్రి ని చూడ్డానికి ఆయన సన్నిహితులు వచ్చారు. వాళ్లని చూడగానే కృష్ణశాస్త్రి ‘కుశలమా..’ అని నోట్ బుక్పై రాసి చూపించారు. దానికి బదులుగా.. వచ్చినవారు కూడా ‘మీరు కుశలమేనా’ అని రాసి కృష్ణశాస్త్రి కి చూపించారు. కొంతసేపయ్యాక వచ్చినవాళ్లు వెళ్లిపోయారు. కృష్ణ శాస్త్రి అక్కడి నుంచి నిష్కృమించారు. సరిగ్గా అదే సమయానికి చక్రవర్తి కృష్ణ శాస్త్రి గదిలోకి ఎంటర్ అయ్యారు. నోట్ బుక్పైన ‘కుశలమా.. మీరు కుశలమేనా…’ అని రాసి ఉండడం చూసిన చక్రవర్తి.. అదే పాటలోని తొలి పదాలు అనుకుని.. దానికి ట్యూన్ కట్టేశారు.
బయటి నుంచి కృష్ణశాస్త్రి రాగానే.. ”గురువుగారూ.. ఆరంభం అదిరింది.. మిగిలిన పాట కూడా రాసేయండి..” అనే సరికి కృష్ణశాస్త్రి ఆశ్చర్యపోయారు.
”ఆరంభం అదరడం ఏమిటి? నేను లేకుండా పాట కూడా రాసేశావా” అని అడిగితే..
”అంతలేదు సార్… మీరు రాసిన మాటలకే ట్యూన్ కట్టాను” అని కుశలమా.. మీరూ కుశలమేనా` అంటూ రాగయుక్తంగా ఆలపించారు చక్రవర్తి.
”పాటా.. నా బొంద.. అది పల్లవి కాదు. వచ్చిన వాళ్లని పలకరించి అలా రాశాను” అనేసరికి ఈసారి షాక్ చక్రవర్తి కి తగిలింది.
”అయినా సరే.. ఇదే బాగుంది.. దీనికే పల్లవి రాసేయండి” అంటూ చక్రవర్తి కూడా బతిమాలేసరికి.. కృష్ణశాస్త్రి అసువుగా… పాట పూర్తి చేసేశారు. ` బలిపీఠం’లోని అన్నిపాటలకంటే ఈ పాటే పెద్ద హిట్టు. చక్రవర్తి కెరీర్లోనూ ఓ మంచి పాటగా మిగిలిపోయింది. అదీ.. ఈ పాట వెనుక స్టోరీ.