కృష్ణా జలాల్లో ఈ ఏడాదికి వాటా పూర్తిగా వాడేసుకున్నారని..ఇక ఒక్క చుక్క కూడా వాడుకోవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు లేఖ రాసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం జీవోను ఏపీ సర్కార్ విడుదల చేయడంతో ఏర్పడిన వివాదం పెద్దదవుతున్న సమయంలో.. కేఆర్ఎంబీ ఏపీకి ఈ ఆదేశాలివ్వడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం సాగర్, శ్రీశైలంలో అందుబాటులో ఉన్న నీటిని.. సాగర్ కుడికాలువ, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల నుంచి ఏపీ తరలించుకుంటోంది. ఇక నుంచి ఆ మూడింటిని నిలిపివేయాలని కేఆర్ఎంబీ స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన దాని కన్నా ఎక్కువే వాడుకున్నారని కేఆర్ఎంబీ లెక్కలు చెబుతోంది. కృష్ణా జలాల నీటి లభ్యత 980 టీఎంసీలు ఉండగా… ఏపీకి 647, తెలంగాణకు 333 టీఎంసీలు కేటాయించాయి. ఈ కేటాయింపుల్లో ఇప్పటి వరకూ.. ఏపీ 647.5… తెలంగాణ 272 టీఎంసీలు వినియోగించుకున్నాయని.. అంటే ఏపీ కోటా పూర్తయిపోయి.. మరో అర టీఎంసీ అదనంగా వాడుకున్నారని కృష్ణాబోర్డు స్ఫష్టం చేసింది. తెలంగాణకు మరో 56 టీఎంసీలు వాడుకోవాల్సి ఉందని… ప్రస్తుంత కృష్ణాలో 60 టీఎంసీలు మాత్రమే నీటి లభ్యత ఉందని స్పష్టం చేసింది. నీటి విడుదలకు సంబంధించిన ఉత్తర్వులను విధిగా పాటించాలని .. ఎలాంటి ఫిర్యాదులకు అవకాశం ఇవ్వరాదని ఏపీకి ఈఎన్సీకి కృష్ణా బోర్డు స్పష్టం చేసింది.
కేఆర్ఎంబీ తాజా ఉత్తర్వులతో… సాగర్ కుడికాల్వతో పాటు…రాయలసీమకు నీటి విడుదల నిలిపివేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ తరలించిన నీటిని కృష్ణాకు వరద వచ్చి ఎగువ ప్రాజెక్టులు అన్నీ నిండి..శ్రీశైలంకు వచ్చే వరకూ వాడుకోవాల్సి ఉంటుంది. వరద రావడం ఆలస్యం అయితే.. రాయలసీమ తాగునీటికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది.