చాలా కాలంగా రాజకీయ కార్యక్రమాల్లేక… సబ్జెక్టుల్లేక ఇబ్బంది పడుతున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలకు.. పోతిరెడ్డిపాడుపై ఏపీ కట్టాలనుకుంటున్న ప్రాజెక్ట్ బాగా ఉపయోగపడుతోంది. ఏపీ ఇచ్చిన జీవో విషయంలో.. కేసీఆర్ ను కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేశారు. దక్షిణ తెలంగాణ నీటి ప్రాజెక్టుల పై కేసీఆర్ వైఖరిని నిరసిస్తూ ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. రాష్ట్ర అవిర్భావ దినోత్సవం సందర్భంగా భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో నిరసన దీక్ష చేపట్టేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధమయ్యారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ విస్తరణకు ఆరు నెలలుగా జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని..దీని పై కాంగ్రెస్ పార్టీ హెచ్చరించినా పట్టించుకోలేదని.. ఆ పార్టీ నేతలు అంటున్నారు.
ఇదే సమయంలో కేసిఆర్ జగన్ మోహన్ రెడ్డి తో కలసి ఆలయ్ లయ్ చేసుకుంటున్నారని… వీరి స్నేహం తెలంగాణ ప్రజలకు ,రైతాంగానికి గొడ్డలి పెట్టు గా మారిందని కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఈ సమస్యను కేసిఆర్ తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని ..ఇదేమి వారిద్దరి ఇంటి వ్యక్తిగత వ్యవహారం కాదంటున్నారు. పాత విషయాలను కాంగ్రెస్ నేతలు లేవనెత్తుతున్నారు. పోతిరెడ్డిపాడు వైఎస్ జీవో విడుదల చేసినప్పుడు కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నారని.. అప్పుడు ఖండించలేదని రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు.
ముచ్చుమర్రి ప్రాజెక్ట్ ను సైతం కేసిఆర్ సీఎంగా ఉన్నప్పుడే చంద్రబాబు నిర్మించారని.. ఆయనా అభ్యంతరం చెప్పలేదంటున్నారు. ఇలా అన్ని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నేతలు పట్టదలతో పని ప్రారంభించారు. అయితే.. టీ కాంగ్రెస్లో ఉన్న గ్రూపుల గోల ఇక్కడా కనిపిస్తోంది. ఎవరికి వారు.. పోతిరెడ్డిపాడుపై తమ వాదన వినిపిస్తున్నారు కానీ.. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ తరపున వాదనలు వినిపించడం లేదు.