రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ అభ్యంతరం చెప్పడంతో ఏపీ సర్కార్ అనూహ్యమైన ప్రణాళికలు వేసుకుంది. తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులను రిస్క్‌లో పెట్టాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు కృష్ణాబోర్డుకు లేఖ రాసింది. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, భక్త రామదాసు, మిషన్ భగీరథ కింద వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు, తుమ్మిళ్ల ఎత్తిపోతల చేపట్టడంతో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల, నెట్టెంపాడు ఎత్తిపోతల, శ్రీశైలం ఎడమగట్టు కాలువ పరిధిని పెంచడం వంటి వాటన్నింటిపై ఏపీ ఫిర్యాదు చేశారు. వీటిలో దేనికి కూడా… తెలంగాణ అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోలేదని.. డీపీఆర్‌లు సమర్పించలేదని స్పష్టం చేసింది. దీంతో.. కృష్ణాబోర్డు.. తెలంగాణకు లేఖ రాశారు. ఆయా ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించాలన్నారు.
మొత్తం ఎనిమిది ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదికలను కృష్ణాబోర్డు కోరింది. డీపీఆర్‌లు, ప్రాజెక్టుల వివరాలు అందజేయాలని తాము 2019 అక్టోబరు 16న కూడా లేఖ రాశామని బోర్డు గుర్తు చేసింది. అప్పట్లో డిగిన సమాచారాన్ని ఇప్పటి వరకూ ఇవ్వలేదని గుర్తు చేసింది. పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణా, గోదావరి బేసిన్లలో కొత్త ప్రాజెక్టుల నిర్మాణ ప్రతిపాదనలు పరిశీలించి సాంకేతిక అనుమతి ఇవ్వడం కూడా బోర్డు పరిధిలో తెలిపింది. బోర్డు తన లేఖను కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖకు కూడా పంపింది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ సర్కార్ ప్రాజెక్టులను రీ డిజైన్ చేసింది. అనేక కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేసి నిర్మాణాలు ప్రారంభించారు. అయితే.. అవన్నీ పాతవేనని.. కొత్తగా అనుమతులు అక్కర్లేదని వాదిస్తూ వస్తున్నారు. డీపీఆర్‌లు సమర్పిస్తే అది కొత్త ప్రాజెక్ట్ అవుతుంది. అందుకే పాత ప్రాజెక్టులని వాదిస్తున్నారు. అపెక్స్ కౌన్సిల్ భేటీలోనూ అదే వాదన వినిపించారు. ఇప్పుడు… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పని సరిగా.. డీపీఆర్‌లు సమర్పింప చేయాలనే వ్యూహంతో లేఖలు రాసింది. కృష్ణాబోర్డు కూడా స్పందించింది. దీనిపై.. తెలంగాణ సర్కార్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.