ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నేతలు… సోషల్ మీడియాలో తమపై వస్తున్న వ్యతిరేక పోస్టులను కట్టడి చేయడానికి కేసులు పెట్టడమే మార్గంగా ఎంచుకున్నారు. కేసుల భయం చూపిస్తే.. పోస్టులు పెట్టడం మానేస్తారని అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. కానీ ఇది ప్రజల్లో చర్చకు కారణం అవుతోంది. వారు కేసులు పెట్టిన వారికి అనూహ్యంగా పాపులారిటీ వస్తోంది. వైసీపీ నేతలు మాట్లాడే దానికి .. రాజకీయ పోస్టులతో కేసులను ఎదుర్కొంటున్న వారి పోస్టులకు తేడా చర్చ కు వస్తోంది. రంగనాయకమ్మ అనే వృద్ధురాలిపై సీఐడీ పోలీసులు పెట్టిన కేసు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ నేతలు పెడుతున్న పోస్టులకు.. ఆమె పెట్టిన పోస్టులను పోల్చి చూపి.. ఎవరిపై కేసులు పెట్టాలో చెప్పాలంటూ.. పోలికలు తెస్తున్నారు.
రంగనాయకమ్మపై కేసు పెట్టిన తర్వాత .. ప్రభుత్వం అందర్నీ కేసుల పేరుతో బెదిరించి..నోరెత్తకుండా చేయాలనుకుంటుందోందని.. ఆమె షర్ చేసిన పోస్టును తామంతా షేర్ చేస్తామని.. నెటిజన్లు ఆ పోస్టును వైరల్ చేశారు. ఓ వైపు పన్నెండు మృతికి కారణం అయి..కొన్ని వందల మంది తీవ్ర అనారోగ్యానికి గురి చేసిన ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై ఐదు వందల రూపాయల ఫైన్‌తో పోయే కేసులు పెట్టి…ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై సీఐడీ కేసులు పెట్టడం ఏమిటని సోషల్ మీడియాలోనూ విమర్శలు వస్తున్నాయి. విపక్షంలో ఉన్నప్పుడు.. సోషల్ మీడియా స్వేచ్చను అపరిమితంగా ఉపయోగించుకుని లబ్ది పొందిన వైసీపీ నేతలు ఇప్పుడు… ప్రతి ఒక్కరిని నియంత్రించాలనుకోవడం ఏమిటని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. కరెంట్ బిల్లుల దగ్గర్నుంచి అన్ని అంశాల్లోనూ ప్రభుత్వం చెప్పుకుంటున్న దానికి..బయట జరుగుతున్నదానికి పొంతన లేకపోవడంతో అన్నింటినీ సోషల్ మీడియాలో పెడుతున్నారు. అదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్మీట్లలో మాట్లాడేందుకు తడబడుతున్నారు. అలాంటి క్లిప్‌లను.. వైరల్ చేస్తున్నారు. ఈ కారణంగా కొద్ది రోజుల కిందట..మొత్తం సీఐడీ విభాగానికి ఓ టాస్క్ ఇచ్చారు. ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్‌ను ప్రకటించారు. ప్రభుత్వంపై ఎవరైనా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే.. స్క్రీన్ షాట్ తీసి.. ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. అప్పటి నుండి వైసీపీ కార్యకర్తలు… తమ నేతలు..ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు పోస్టులు పెట్టినా.. స్క్రీన్ షాట్లు తీసి.. సీఐడికి పంపుతున్నారు. వాటిపై సీఐడీ చర్యలు తీసుకుంటోంది.
వైసీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేస్తేనే సీఐడీ స్పందిస్తోంది. ఇతరులు చేస్తే స్పందించడం లేదు. ఏపీ రాజకీయ పార్టీల్లో అత్యంత దారుణమైన భాషతో.. మార్ఫింగ్ ఫోటోలతో..ప్రత్యర్థులపై విరుచుకుపడే సోషల్ మీడియా టీం అధికార పార్టీకి ఉందని చెబుతూ ఉంటారు. టీడీపీ మహిళా నేతలపై.. అమరావతి లో ఉద్యమం చేస్తున్న మహిళలపై… కొన్ని వందల మార్ఫింగ్ ఫోటోలు ఇప్పటికీ.. సర్క్యూలేట్ అవుతూ ఉంటాయి. చంద్రబాబుకు శ్రద్ధాంజలి అని.. లోకేష్ చేయని ట్వీట్లను క్రియేట్ చేసి.. వైరల్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిపై… ఎప్పటికప్పుడు… ప్రభుత్వం ప్రకటించిన సీఐడీ వాట్సాప్ నెంబర్‌కు ఫిర్యాదులు చేస్తూనే ఉంటారు. కానీ స్పందన మాత్రం ఇంత వరకూ ఒక్క సారంటే ఒక్క సారి కూడా రాలేదు.
కేసులు పెడతామనే భయపెట్టి.. సోషల్ మీడియాలో పోస్టులు తగ్గించడం వైసీపీ లక్ష్యంగా కనిపిస్తోంది. కానీ కేసులు పెట్టడం వల్ల… ఆయా పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలు ఫేమస్ అవుతున్నారు. మీడియాలో చోటు దక్కించుకుంటున్నారు. ఆయా పార్టీల పెద్దల దృష్టిలో పడుతున్నారు. అది వారికి కొత్త అవకాశాలు సృష్టిస్తోంది. దాంతో.. అలాంటి వారు అంతకంతకూ పెరుగుతున్నారు. కానీ తగ్గడం లేదు. అందుకే.. కేసుల వ్యూహం అంత కరెక్ట్ కాదనే వాదన గట్టిగానే వినిపిస్తోంది.