సినిమా పరిశ్రమలో జరిగే విచిత్రాలు ఇంకెక్కడా జరగవేమో. అందుకే దీన్ని ‘చిత్ర’ పరిశ్రమ అన్నారు. ఎంత ప్రతిభ ఉన్నా.. ఒక్కోసారి అవకాశం రాదు. వచ్చినా సిల్లీ కారణాలతో అది చేజారిపోతుంది. నిజం.. నటన రాకో, అందంగా లేకో… అవకాశాలు కోల్పోయారంటే దాంట్లో న్యాయం ఉందనిపించొచ్చు. కానీ.. ఓ త్రిపుల్ ఫైవ్ సిగరెట్టు పెట్టె వల్ల ఛాన్సు మిస్సయ్యిందంటే..? వినడానికి విచిత్రంగా అనిపిస్తుంది కదూ. కానీ అదే జరిగింది.
ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోవాలంటే మనం ‘వీరాభిమన్యు’ రోజుల్లోకి వెళ్లిపోవాలి. దుండీ నిర్మాతగా విక్టరీ మధుసూధనరావు దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. మహాభారతంలో అర్జునుడి పాత్ర చుట్టూ నడిచే కథ. శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ ఫిక్సయ్యారు. టైటిల్ రోల్ కోసం ఓ చురుకైన కుర్రాడు కావాలి.
నిజానికి అప్పట్లో అభిమన్యుడు పాత్ర అంటే హరనాథ్ గుర్తొచ్చేవారు. నర్తన శాల, పాండవ వనవాసంలో అభిమన్యుడు హరనాథే. ఈసారీ ఆయన్నే తీసుకుందామని దుండీ చెబితే… ‘లేదు.. అందరూ వెళ్లే దారిలో మనం ఎందుకు వెళ్లాలి? ఓ కొత్త కుర్రాడ్ని పరిచయం చేద్దాం. అభిమన్యుడు ఇలానే ఉంటాడేమో రా.. అని ప్రేక్షకులు అనుకోవాలి’ అని కొత్త కుర్రాడిని అన్వేషించే పనిలో పడ్డారు మధుసూధనరావు.
డుండీ ఓసారి మద్రాస్‌లోని ఆంధ్రా క్లబ్‌కి వెళ్లారు. అక్కడ ఆరున్నర అడుగుల ఆజానుభావుడు కనిపించాడు. చురుకైన కళ్లు. మంచి.. దేహధారుఢ్యం. కుర్రాడు షార్ప్‌గా ఉన్నాడు. అభిమన్యుడు పాత్రకు తనైతే బాగుంటాడని అనిపించింది. ఆ కుర్రాడు కూడా సినిమా అవకాశాల కోసమే ప్రయత్నిస్తున్నాడు. వెంటనే ఆ కుర్రాడి దగ్గరకు వెళ్లి..’మా సినిమాలో మంచి వేషం ఉంది. దానికి నువ్వు సరిపోతావనిపిస్తోంది. ఇదిగో అడ్రస్సు.. ఫలానా టైమ్‌కి వచ్చేయ్’ అంటూ చేతిలో కార్డు పెట్టారు.
ఆ కుర్రాడు హుషారుగా… చెప్పిన సమయానికి, చెప్పిన చోటికి వచ్చాడు. డుండీ కూడా ఆఫీసులోనే ఉన్నారు. కానీ విక్టరీ మధుసూధనరావు మాత్రం రాలేదు. ఈలోగా ఆఫీసు బయట.. కూర్చున్నాడు ఆ కుర్రాడు. అతని చేతిలో త్రిపుల్ ఫైవ్ సిగరెట్ ప్యాకెట్ ఉంది. అది లేకపోతే.. అతనికి క్షణం కూడా గడవదు. కాసేపు కూర్చోవడం.. బయటకు వెళ్లి ఓ దమ్ము లాగి రావడం.. గంటలు గడుస్తున్నా.. ఎవరూ లోపలకు పిలవడం లేదు. ఇక ఓపిక నశించి… నేరుగా ప్రొడ్యూసరు గారి గదికి వెళ్లిపోయాడు.
”సార్.. మీరు రమ్మన్నారు. వచ్చాను. ఇంకెంత సేపు కూర్చోమంటారు” అని అడిగాడు.
”నాకు నువ్వు నచ్చావ్ అబ్బాయ్.. మా డైరెక్టరు గారికి కూడా నచ్చాలి కదా… ఇంకాసేపు ఓపిక పట్టు…” అని దుండీ చెప్పేసరికి ఇంకేం చేయలేక… మళ్లీ బయటకు వచ్చి అక్కడే కూర్చున్నాడు.
ఎంతసేపని ఎదురు చూస్తాడు. మళ్లీ సరదాగా బయటకు వెళ్లి కాస్త గాలి పీల్చుకుందామని కదిలాడు. కానీ సిగరెట్టు ప్యాకెట్ అక్కడే బల్ల మీద వదిలేశాడు.
ఈలోగా మధుసూధనరావు ఆఫీసులో ఎంటర్ అయ్యారు. వస్తూ వస్తూ.. బల్ల మీద త్రిపుల్ ఫైవ్ ప్యాకెట్ కూడా చూశారు.
డైరెక్టరు గారు వచ్చారు.. ఆ కుర్రాడ్ని పిలవండి… అని ప్రొడ్యూసరు అనేసరికి.. అతన్ని వెదుక్కుంటూ ఇద్దరు చెరో పక్కకూ పరుగెట్టారు. ‘హమ్మయ్య డైరెక్టరు గారు వచ్చేశారు.’ అనుకుంటూ.. ఆ అబ్బాయి కూడా ఆనందంగా ఆఫీసులోకి అడుగుపెట్టాడు.
”బయట బల్లమీద ఉన్న ఆ ట్రిపుల్ ఫైవ్ ప్యాకెట్ నీదేనా” – రాగానే విక్టరీ మధుసూధనరావు వేసిన తొలి ప్రశ్న అది.
”అవును సార్.. నాదే” – ఆ కుర్రాడి జవాబు.
”అయితే నువ్వు వెళ్లొచ్చు.. నీకు ఈ సినిమాలో అవకాశం లేదు” డైరెక్టరు గారు బాంబు పేల్చారు.
”అదేంటి సార్.. వేషం కోసం పిలిచారు. నేనొచ్చాను. ఇంతకీ నేను చేసిన తప్పేంటి” అని నిలదీశాడు.
”నాకు సిగరెట్లు తాగేవాళ్లం ఇష్టం ఉండదు. నిన్ను చూస్తే సిరగెట్టు లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేనివాడిలా ఉన్నావు. ఒక వేళ ఈసినిమాలో నిన్ను తీసుకుంటే నా సెట్లోనే దొంగచాటుగా సిరగెట్లు కాలుస్తావ్. నాకోసం నువ్వు నీ అలవాట్లు మార్చుకోవడం నాకు ఇష్టం లేదు. అలాగని సిగరెట్లు తాగేవాడిని నేను భరించలేను. పైగా ఇలా పెద్దవాళ్ల దగ్గరకు వచ్చేటప్పుడు స్టైల్‌గా జేబులో సిగరెట్టు ప్యాకెట్ పెట్టుకుని రావడం, దాన్ని బల్ల మీద వదిలేసి గాలికి తిరిగి రావడానికి వెళ్లడం. ఇదీ నచ్చలేదు.. ఇక నువ్వు వెళ్లొచ్చు” అని ఆ కుర్రాడిని పంపించేశారు.
దాంతో ఎంతో ఆశగా వచ్చిన ఆ అబ్బాయి… నీరసంగా, నిస్తేజంగా ఇంటి మొహం పట్టాడు. అదీ సిగరెట్టు పెట్టె కథ. ఇంతకీ ఆ కుర్రాడెవరో చెప్పలేదు కదూ. రెబల్ స్టార్ కృష్ణంరాజు. ఈ సంఘటన జరిగిన రెండేళ్ల తరవాత గానీ.. కృష్ణం రాజు సినిమాల్లోకి అడుగుపెట్టలేకపోయాడు. ఈ పాత్రకు ఆ తరవాత శోభన్‌బాబుని ఎంచుకున్నారు. లేదంటే… వీరాభిమన్యుడిగా వెండి తెరపై కృష్ణంరాజుని చూసేవాళ్లం.