శ్రీశైలంకు వచ్చిన వరద నీటిని ప్రత్యేక ప్రాజెక్టు నిర్మించి రాయలసీమకు తరలించుకుపోతే.. కృష్ణా డెల్టా పరిస్థితి ఏమిటన్న చర్చ.. ఇప్పుడు కోస్తా రైతు సంఘాల నేతలు తెరపైకి తెస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిండటం.. కష్టంగా మారింది. పట్టిసీమ కట్టక ముందు కృష్ణాడెల్టా ఇబ్బందుల్లో పడింది. శ్రీశైలం నుంచి వస్తున్న అరకొర నీరు.. వాటితో పాటు.. పట్టిసీమ నీటితో అవసరాలు తీర్చుకున్నారు. కానీ ఇప్పుడు.. శ్రీశైలం నుంచి రోజుకు మూడు టీఎంసీల నీటిని తరలించుకునే ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తోంది. తమ గురించి కూడా ఆలోచించాలని కోస్తా రైతులు కోరుతున్నారు.
నాగార్జున సాగర్ కుడి కాల్వ కింద గుంటూరు, ప్రకాశం జిల్లాలు, ఎడమ కాల్వ కింద ఉన్న కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఉన్న ఆయకట్టు ఉంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఉన్న 11 లక్షల 74 వేల ఎకరాలు, ఎడమ కాల్వ కింద కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 3 లక్షల 97 ఎకరాల ఆయకట్టుకు ఉంది. నాగార్జునసాగర్ కుడి కాల్వకు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 132 టీఎంసీలు, ఎడమ కాల్వలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి 32 టీఎంసీల నీటి కేటాయింపులున్నాయి. ఓ వైపు తెలంగాణలో కృష్ణాపై కడుతున్న అక్రమ ప్రాజెక్టులు..మరో వైపు.. ఏపీ సర్కార్ శ్రీశైలంకు వచ్చిన నీటిని రాయలసీమకు తరలిస్తే.. కోస్తాకు సాగునీటి సమస్య వస్తుందన్న అభిప్రాయంతో రైతులు ఉన్నారు.
ఇప్పటి వరకూ.. తెలంగాణ, ఏపీల మధ్య పోతిరెడ్డిపాడు ఇష్యూ.. సమస్యగా ఉంది. కానీ ఇప్పుడు.. కోస్తా రైతులు కూడా… తమకు అన్యాయం జరుగుతుందన్న వాదనను వినిపిస్తున్నారు. ఇది కొత్త వివాదానికి కారణం అయ్యే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం స్పందించి.. సాగర్ ఆయుకట్టు రైతుల సాగునీటికి భరోసా ఇవ్వాల్సి ఉంది. లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయంటున్నారు..