ప్రైవేటు ల్యాబుల్లో కరోనా వైరస్ టెస్టులు చేయించుకోవడం.. ప్రజల హక్కు అని.. తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం… కరోనా టెస్టుల కోసం.. ప్రైవేటు ఆస్పత్రులకు.. ల్యాబ్‌లకు అవకాశం ఇవ్వలేదు. అలా చేస్తే.. దోపిడికి పాల్పడతాయని ఈటల రాజేందర్ గతంలో చెప్పారు. అనుమతి ఇచ్చే ప్రశ్నే లేదన్నారు. అయితే.. టెస్టింగ్‌లపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణలో… ప్రభుత్వం గాంధీ, నిమ్స్‌లో మాత్రమే..కోవిడ్ -19 పరీక్షలు చేయించుకోవాలని చెప్పడం.. రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రైవేటు ఆస్పత్రులపై నమ్మకం లేకపోతే… ఆరోగ్య శ్రీ సేవలకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.
తెలంగాణలో కరోనా టెస్టింగ్ సామర్థ్యం ఉన్న ఆస్పత్రులు, ల్యాబ్‌లు.. ఐసీఎంఆర్‌కు దరఖాస్తు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. ఐసీఎంఆర్ సూచించిన … నిర్దారించిన ఆస్పత్రుల్లో చికిత్సకు అనుమతించాలని.. హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణలో కరోనా టెస్టులను చాలా పరిమితంగా చేస్తున్నారు. ఐసీఎంఆర్ నిర్ధారించిన ఆర్టీ పీసీఆర్ టెస్టులను మాత్రమే చేస్తున్నారు. దీని వల్ల చాలా కొద్ది మొత్తంలోనే కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే.. టెస్టులు చేస్తున్న వారిలో ఆరు శాతం మందికిపైగా పాజిటివ్ వస్తోంది. వైరస్ సోకినా.. బయటపడని వారి వల్ల మరింత మందికి వైరస్ సోకుతోందని.. త్వరంగా గుర్తించడానికి మరిన్ని టెస్టులు చేయాలని.. ర్యాపిడ్ టెస్టులు చేయాలన్న సలహాలు నిపుణుల నుంచి వచ్చాయి.
ఇతర రాష్ట్రాలు పెద్ద ఎత్తున టెస్టులు చేస్తున్నాయి. కానీ తెలంగాణ మాత్రం.. పెద్దగా టెస్టుల జోలికి వెళ్లడం లేదు. ప్రైవేటు ల్యాబ్స్‌కు చాన్సివ్వలేదు. తెలంగాణ హైకోర్టు ఆదేశంతో ప్రైవేటు ల్యాబ్‌లు.. ఐసీఎంఆర్‌కు దరఖాస్తు చేసుకుంటే.. తెలంగాణలో టెస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం కాకుండా.. ప్రజలు స్వచ్చందంగా .. తమ సొంత డబ్బులు పెట్టి టెస్టులు చేయించుకుంటారని భావిస్తున్నారు.