ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో బీసీల జనాభాకు తగ్గట్లుగా రిజర్వేషన్లు అమలు చేసేలా ఆదేశాలివ్వాలంటూ.. టీడీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రిజర్వేషన్లు యాభై శాతం లోపే ఉండాలని స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన మినహాయింపులు ఇప్పుడు వర్తించని తేల్చి చెప్పేసింది. దాంతో.. ఏపీ స్థానిక ఎన్నికలకు ఉన్న ఓ ఇబ్బంది తీరిపోయినట్లయింది. స్థానిక ఎన్నికలు జరగడానికి ముందు ఏపీ సర్కార్.. యాభై శాతానికి మించిన రిజర్వేషన్లతో నోటిఫికేషన్ ఇచ్చింది. దానిపై.. ప్రతాపరెడ్డి అనే వ్యక్తి న్యాయపోరాటం చేయడంతో.. హైకోర్టు.. యాభై శాతంలోపే రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది.
అయితే.. బీసీలకు అన్యాయం జరుగుతుందని.. ప్రభుత్వం.. సుప్రీంకోర్టుకు వెళ్లాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం.. యాభై శాతం లోపే రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించుకుంది. అప్పుడే టీడీపీ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఏపీ సర్కార్ కూడా.. ఇంప్లీడ్ కావాలని డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. టీడీపీ నేతలు వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో.. స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో రిజర్వేషన్ల పరంగా ఏమైనా ఇబ్బంది ఉంటే.. తొలగిపోయినట్లయింది.
ఈ రిజర్వేషన్ల అంశంపై టీడీపీ నతేలు వేసిన పిటిషన్ కారణంగా ఎన్నికల ప్రక్రియకు ఇబ్బంది కలగలేదు. కరోనా కారణంగా ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. ఎప్పుడు అవకాశం దొరికితే.. అప్పుడు ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ సర్కార్.. రెడీగా ఉంది. ఎస్ఈసీ గా ఉన్న రమేష్ కుమార్ తొలగింపు వివాదంపై దాఖలైన పిటిషన్లు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. విచారణలు కూడా పూర్తయ్యాయి. తీర్పు ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉంది. ఆ తీర్పు తర్వాత ఏపీలో స్థానిక ఎన్నికలపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.