నవ్యాంధ్రలో రెండో ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతోంది. గత ఏడాది మే 23న జరిగిన కౌంటింగ్‌లో వైసీపీ తిరుగులేని విజయం సాధించగా… మే 30వ తేదీన జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. గత ప్రభుత్వ విధానాలకు భిన్నంగా తనదైన పద్దతిలో పాలన సాగిస్తున్నారు. ఈ ఏడాది పాలనలో ప్రజా ఆంక్షాలు నెరవేరుస్తున్నారా..? అభివృద్ధి పరంగా ప్రజల కలల్ని తీరుస్తున్నారా..? వంటి అంశాలపై తెలుగు 360 సమీక్ష చేస్తోంది. ఈ రోజు 30వ తేదీ వరకూ.. రోజుకో అంశంపై ప్రభుత్వ పనితీరును విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నాం. తొలి రోజు.. జగన్మోహన్ రెడ్డి ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాంగా పెట్టుకున్న సంక్షేమ పథకాల గురించి … అందుకోసం ప్రభుత్వం పెడుతున్న ఎఫర్ట్స్… ప్రజలకు అందుతున్న సాయంపై విశ్లేషిస్తున్నాం..!
తొలి ఏడాది పథకాల అమలులో రాజీలేని ప్రయత్నం..!
“తెలుగుదేశం పార్టీలా పేజీలకు పేజీలు మేనిఫెస్టో పెట్టను.. రెండు అంటే రెండు పేజీలు మాత్రమే మేనిఫెస్టో పెడతా.. అందులో ఉన్న వన్నీ అమలు చేస్తా..” ఎన్నికలకు రెండు, మూడేళ్ల ముందు జగన్మోహన్ రెడ్డి ఇదే నినాదం వినిపించేవారు. టీడీపీ తన మేనిఫెస్టోలో ఆరు వందలకుపైగా హామీలు ఇచ్చిందని.. కానీ అమలు చేయలేదని.. తాము మాత్రం అలా కాదని.. ఆయన బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అన్నట్లుగా పాంప్లెట్ తరహాలో మేనిఫెస్టో విడుదల చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్నే బైబిల్, ఖురాన్, భగవద్గీతగా చెబుతూ.. అమలు ప్రారంభించారు. నవనరత్నాలతో పాటు… పాదయాత్రలో ఇచ్చిన అనేక హామీలను అమలు పర్చాల్సిన బాధ్యత ఒత్తిడి ఉన్న సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్.. తొలి ఏడాదిలో… పథకాల అమలులో తనదైన ముద్ర వేశారని చెప్పుకోవచ్చు.
ప్రజల ఖాతాల్లో రూ. వేల కోట్ల సంక్షేమ నిధులు..!
వైసీపీకి.. జగన్మోహన్ రెడ్డికి మొట్టమొదటి ప్రాధాన్యతా పథకం.. వైఎస్ఆర్ రైతు భరోసా. ప్రతీ రైతుకు రూ. 12500 ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. ఈ పథకానికి ఐదేళ్ల కిందటే రూపకల్పన చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత అంటే 2015లో టీడీపీ సర్కార్ రుణమాఫీ చేయలేదని.. చెబుతూ.. రైతు భరోసా యాత్ర చేశారు. ఆ సమయంలోనే తాను వస్తే రైతులకు ఒకే సారి.. రూ. 12,500 పెట్టుబడి సాయం చేస్తానని ప్రకటించారు. ఆ పథకాన్నే ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాంగా ప్రచారం చేసుకున్నారు. రైతుల్లో ఆదరణ పొందారు. ప్రతీ ఏడాది మేలో రైతు భరోసా సాయం చేస్తామని చెప్పారు. అయితే.. జగన్ బాధ్యతలు చేపట్టేనాటికి మే 30 అయిపోయింది. దాంతో మరో ఏడాది పాటు సాయం ఇవ్వరేమో అని అనుకున్నారు.. కానీ.. జగన్ రైతుల గురించి ఆలోచించి.. తొలి ఏడాది అక్టోబర్‌లో రైతులకు నిధులు బదిలీ చేశారు. మళ్లీ రెండో ఏడాది మేలోనే నిధులు బదిలీ చేశారు. అయితే మేనిఫెస్టోలో చెప్పినట్లుగా కాకుండా.. పథకంలో మౌలికమైన మార్పులు చేశారు. ఒకే విడత ఇస్తేనే రైతులకు ప్రయోజనం చెప్పిన సీఎం జగనే.. మూడు విడతల్లో ఇస్తే మరింత ప్రయోజనం అని.. రైతులే కోరుకున్నారని.. అలా చేశారు. మరో రూ. వెయ్యి సాయం పెంచారు. అయితే.. కేంద్రం తన పథకం కింద ఇస్తున్న సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లగా ప్రచారం చేసుకుంటూ.. రూ. ఐదు వేలు తగ్గించడం మాత్రం వివాదాస్పదమయింది.
చెప్పిన సమయానికి నిధులివ్వడానికి ప్రాధాన్యం..!
నవరత్నాల్లో.. రైతు భరోసా తర్వాత… పలు కీలక పథకాలు అమలు చేశారు. అందులో అమ్మఒడి ఒకటి. రైతు భరోసా కంటే ఎక్కువ ఆర్థిక భారం ఉన్న పథకం ఇది. రూ. ఆరేడు వేల కోట్లు ఒకే సారి తల్లుల ఖాతాల్లోకి జమ చేయాల్సిన పథకం. జనవరిలో అందరి అకౌంట్లలోకి డబ్బులు వేస్తామని చెప్పి.. చేశారు. వాహన మిత్ర పథకం పేరుతో.. క్యాబ్ యజమానులకు రూ. పదివేల సాయం చేశారు. మగ్గమున్న ప్రతి చేనేత కుటుంబానికి వైఎస్సార్ నేతన్న నేస్తం కింద రూ.24 వేలు ఇచ్చే పథకాన్ని కూడా ప్రారంభించారు. ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని కొత్త రూపు ఇచ్చి ప్రారభించారు. జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన పేరుతో.. నిధులు విడుదల చేశారు.
తొలి ఏడాది ప్రారంభానికి నోచుకోని కొన్ని రత్నాలు..!
తొలి ఏడాది నవరత్నాల్లో కొన్ని పథకాలను అమలు చేయలేకపోయారు. అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజమ్‌లకు నెలకు రూ. రూ.5 వేల చొప్పున సాయం చేస్తామని ప్రకటించారు. కానీ ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. నాయి బ్రాహ్మణులు, రజకులు, టైలర్లు.. షాపులున్న ప్రతి ఒక్కరికీ రూ.10 వేలు ఏడాదికి ఒకసారి ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. తొలి ఏడాదిలో ఆ మేరకు సాయం అందించలేకపోయారు. కాపు నేస్తం పథకం కింద ఆ వర్గం మహిళలకు రూ. 15వేలు ఇచ్చే పథకాన్నీ తొలి ఏడాదిలో ప్రారంభించలేకపోయారు. మేనిఫెస్టోలో వైఎస్సార్ చేయూత అనే పథకాన్ని ప్రకటించారు. ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళకు ఏటా రూ.18,750 ఇస్తామని చెప్పారు. ఆ పథకమూ తొలి ఏడాది ప్రారంభం కాలేదు. డ్వాక్రా రుణాలు మాఫీ హామీ కూడా ఇంకా అమలు ప్రారంభం కాలేదు. ఇవి కాకుండా.. మేనిఫెస్టోలో ఉన్న అనేక హామీల అమలు ఇంకా ప్రారంభం కాలేదు. సన్నబియ్యం పథకం వాయిదాలు పడుతూ వస్తోంది.
లబ్దిదారులను తగ్గిస్తున్నారనే విమర్శలు కూడా..!
సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం రాజీపడటం లేదు కానీ.. లబ్దిదారులను మాత్రం దారుణంగా తగ్గిస్తున్నారనే విమర్శలను ప్రభుత్వం ఎదుర్కొంటోంది. రైతు భరోసా కింద 60 లక్షల మందికిపైగా రైతులకు సాయం చేస్తామని మొదట్లో చెప్పిన ప్రభుత్వం ఇప్పుడా సంఖ్యను 45 నుంచి 50 లక్షలకే పరిమితం చేసింది. అమ్మఒడి లబ్దిదారుల విషయంలోనూ అంతే. ఇతర పథకాల విషయంలో లబ్దిదారుల సంఖ్యను తగ్గించుకునే ప్రయత్నం చేయడం విమర్శలకు తావిచ్చింది. అయితే.. ఇప్పటికి ముగిసింది ఒక్క ఏడాదే. సంక్షేమంలో సక్సెస్ దిశగా తొలి అడుగు వేశారని అనుకోవచ్చు. మిగిలిన నాలుగేళ్లలో సంక్షేమంలో వైఎస్ ముద్ర చూపించే అవకాశం ఉంది.