జనసేన పార్టీ నేత నాగేంద్రబాబు హఠాత్తుగా గాడ్సే వాదం ఎత్తుకోవడంతో ఆ పార్టీ నేతలకు షాక్ కొట్టినట్లయింది. ఆయన వాదనను ఎలా సమర్థించాలో తెలియక సతమతమవుతున్నారు. ఈ అంశంపై తెలంగాణలో పలువురు ఫిర్యాదులు చేశారు. గాంధీని అవమానించారంటూ.. ఓయూ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదయింది. సోదరుడి వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ స్పందించాలనే డిమాండ్లు అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణలోనూ వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ నాగబాబు వ్యాఖ్యలపై రచ్చే జరిగింది. నాగబాబు గాడ్సే వాదంపై .. జనసేన నేతలు.. ఎటూ స్పందించడం లేదు కానీ.. అవి నాగబాబు వ్యక్తిగత వ్యాఖ్యలని మాత్రం.. వాదిస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. గాంధీయిజాన్ని నమ్ముతారు. ప్రచారం చేస్తారు. ఆయన గాడ్సే గురించి ఎప్పుడూ కాస్త సానుకూలంగా కూడా చెప్పేలేదు. అసలు అలాంటి అంశాల జోలికి వెళ్లలేదు. పవన్ కల్యాణ్ అనే కాదు.. నాగబాబు కూడా.. జాతీయ, అంతర్జాతీయ, దేశభక్తి వంటి అంశాలపై ఇంత వరకూ ఎక్కడా సీరియస్‌గా కామెంట్లు చేసిన సందర్భాలు లేవు. ఆయన స్టేట్ రేంజ్‌లోనే.. అదీ కూడా ఏపీ రేంజ్‌లోనే మాట్లాడుతూ ఉంటారు. హఠాత్తుగా గాడ్సేను దేశభక్తుడ్ని చేయడానికి ఎందుకు ప్రయత్నించడం ప్రారంభించరానేది.. కొంత మందికి సందేహంగానే ఉంది. కారణం లేకుండా.. నాగబాబు అలాంటి ట్వీట్లు చేయరని.. ఓ ప్రత్యేకమైన కారణం ఉంటుందని.. రాజకీయవర్గాలు కూడా నమ్ముతున్నాయి.
నాథూరాం గాడ్సేకు .. నాగబాబు ఇచ్చిన దేశభక్తి సర్టిఫికెట్‌కు యూనానిమస్‌గా వ్యతిరేకత కనిపించడం లేదు. రామ్‌గోపాల్ వర్మ.. నాగబాబు చెప్పింది కరెక్టేనని స్టేట్మెంట్ ఇచ్చి.. గాడ్సేపై సినిమా తీస్తానని ప్రకటించారు. సోషల్ మీడియా చర్చల్లోనూ.. కొంత మంది గాడ్సే దేశభక్తి పరుడని చెబుతున్నారు. అప్పటి మీడియా అలా గాడ్సేను ఉన్మాదిగా ముద్ర వేసిందని చెబుతున్నారు. ఇలా వాదిస్తున్న నాగబాబుతో సహా అనేక మందికి.. గాడ్సే అనే వ్యక్తి దేశభక్తి గురించి.. ప్రత్యక్షంగా తెలియదు. ఎవరో ఎక్కడో రాస్తే నమ్మి.. అదే మాట చెబుతున్నారు. ఎవరు ఏది నమ్మితే అదే నిజం.. అనే పరిస్థితి వచ్చినప్పుడు.. ఇలాంటి వివాదాలే తెరపైకి వస్తాయి మరి..!