ఎల్జీ పాలిమర్స్ సంస్థ గ్యాస్ లీకేజీ ఘటనపై చేయబోతున్న న్యాయపోరాటానికి ఢిల్లీలో అత్యంత ఖరీదైన లాయర్‌గా ప్రసిద్ధి చెందిన ముకుల్ రోహత్గీని నియమించుకున్నారు. రోహత్గీ మాజీ అటార్నీ జనరల్. ఆయన అంత సామాన్యంగా కేసుల్ని టేకప్ చేయరు. చేసినా.. నిమిషానికి ఇంత అని వసూలు చేసే టాప్ లాయర్ల కేటగరీలో ఆయన ఉంటారు. ముకుల్ రోహత్గీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా.. ఉపయోగించుకుంటోంది. ఆయనకు రూ. ఐదు కోట్లు చెల్లించి మరీ అమరావతి పిటిషన్లపై హైకోర్టులో వాదనలు వినిపించేందుకు నియమించింది. అంతకు ముందు…. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో వివిధ సందర్భాల్లో బెయిల్ పిటిషన్ల కోసం.. ఇతర సందర్భాల్లో.. ముకుల్ రోహత్గీని నియమించుకున్నారు.
అది ప్రైవేటు వ్యవహారం కాబట్టి.. ఆయన ఫీజుగా ఎన్ని కోట్లు చెల్లించుకున్నారో వెల్లడి కాలేదు. ఈ కేసుల విషయం మాట్లాడేందుకు ఢిల్లీలో ఏపీ వ్యవహారాలు చూసే.. వైసీపీ కీలక ఎంపీ ఒకరు.. తరచు రోహత్గీని కలుస్తూంటారు. అలా వారి మధ్య బాండింగ్ ఏర్పడటంతో… ఎల్జీ పాలిమర్స్ తరపున కూడా.. వాదించాలని ఆయన సిఫార్సు చేసినట్లుగా చెబుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల సమయంలో..ఎల్జీ పాలిమర్స్ తయారు చేసే ఉత్పత్తులకు అనుమతి లేనప్పటికీ… ప్రారంభానికి ఎన్వోసీ ఇప్పించడంలో ఆ ఎంపీది కీలక పాత్ర అంటున్నారు. ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్‌ను న్యాయపరంగా గట్టెక్కించేందుకూ ఆయన బాధ్యత తీసుకున్నారని చెబుతున్నారు. ఎల్జీ పాలిమర్స్ సంస్థ విశాఖ గ్యాస్ లీక్ ఘటనను కోర్టుల్లో లిటిగేషన్ల ద్వారా ఇరికించేసి… తన పని తాను చేసుకునే ప్రయత్నంలో ఉంది.
ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి.. ఎదురుదెబ్బ తిన్నది. కానీ.. భారత న్యాయవ్యవస్థను ఉపయోగించుకుని.. సాగదీత కోసం తన వంతు ప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్జీటీకి అసలు సుమోటోగా విచారించే అర్హత లేదని.. సుప్రీంకోర్టులో ఎల్జీ పాలిమర్స్ వాదించడంలోనే మతలబు ఉందంటున్నారు. మొత్తానికి జగన్ అక్రమాస్తుల కేసులు.. అమరావతి రాజధానిపై పిటిషన్లు.. చివరికి ఎల్జీ పాలిమర్స్ కేసును కూడా వాదిస్తున్న లాయర్ ఒక్కరే కావడంతో.. టీడీపీ నేతలకు… లింకులు పెట్టి విమర్శించడానికి కూడా మంచి అవకాశం లభించినట్లయింది.