చిత్రసీమలో విచిత్రమైన సమస్య కనిపిస్తోంది. దర్శకులకు హీరోలు దొరడకం లేదు. హీరోలకు దర్శకులు దొరకడం లేదు. ఎందుకంటే ప్రతీ ఒక్కరూ ఏదో ఓ ప్రాజెక్టుతో బిజీ. కానీ కొంతమంది దర్శకులు మాత్రం… చాలా నిదానంగా సినిమాలు చేస్తున్నారు. స్టార్ డమ్ ఉన్నా, క్రేజ్ ఉన్నా, కథలు సిద్ధం చేయగల సామర్థ్యం ఉన్నా, యేడాదికి ఒకటి, రెండేళ్లకు ఒకటి అంటూ కాలక్షేపం చేస్తున్నారు. టాప్ దర్శకులందరిదీ దాదాపుగా ఒకటే తీరు. యేడాదికి ఒకట్రెండు సినిమాలు తీసి, ఎప్పుడూ టచ్‌లో ఉంటే తమకు క్రేజ్ ఉండదని భయపడతారో ఏమో. అసలు అలాంటి ప్రయత్నాలే చేయరు. త్రివిక్రమ్, కొరటాల శివ, బోయపాటి శ్రీను.. వీళ్లంతా ఒకటే. ఇక రాజమౌళి సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. దాంతో వీళ్లందరితో సినిమాలు చేయాలనుకున్న హీరోలు.. నిరుత్సాహానికీ నీరసానికీ గురవుతున్నారు.
2001లో దర్శకుడిగా ప్రయాణం మొదలెట్టాడు రాజమౌళి. ఇప్పటికి దాదాపు 20 ఏళ్లయ్యింది. మొత్తంగా తీసిన సినిమాలు మాత్రం 12 మాత్రమే. అంటే యేడాదికి ఒక్కటి కూడా లేదు. రాజమౌళి కథలు భారీగా ఉంటాయి. టైమ్ ఎక్కువ పడుతుంది అనుకుంటే.. స్టూడెంట్ నెంబర్ 1, సై, సింహాద్రి, విక్రమార్కుడు, ఛత్రపతి.. ఇవన్నీ మామూలు కమర్షియల్ సినిమాలే. అప్పుడూ.. ఇంతే సమమం తీసుకునేవాడు. రాజమౌళి స్టైల్, స్పీడ్ ఇలానే సాగితే… తన కెరీర్ మొత్తంలో మరో 5 సినిమాలు తీస్తాడేమో అంతే.
త్రివిక్రమ్ కూడా అంతే. 2002లో దర్శకుడిగా మారాడు త్రివిక్రమ్. ఇప్పటికి పదంటే పదే సినిమాలు తీశాడు. అంటే రెండేళ్లకు ఒక సినిమా. త్రివిక్రమ్ రాజమౌళిలా మరీ భారీ సినిమాలు, విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్ద పీట వేసే కథలు ఎంచుకోడు. దాదాపుగా అన్నీ ఫ్యామిలీ, యాక్షన్ డ్రామాలే. కానీ… అదే నత్తనడక.
పదిహేనేళ్లలో కేవలం ఎనిమిది సినిమాలు తీయగలిగాడు బోయపాటి శ్రీను. అంటే.. రెండేళ్లకు ఓ సినిమా అన్నమాట. కొరటాల శివదీ ఇంతే స్పీడు. 2013లో రచయిత నుంచి దర్శకుడిగా ప్రమోషన్ తెచ్చుకున్నాడు కొరటాల. అయితే ఈ ఏడేళ్లలో అయిదు సినిమాలే తీశాడు. మరో ఐదు సినిమాలు తీసి రిటైర్ అవుతానని అప్పుడే స్టేట్మెంట్ కూడా ఇచ్చేశాడు. అయితే అందుకు మరో ఐదారేళ్లు పట్టొచ్చు. పరశురామ్, సందీప్ రెడ్డి వంగా, నాగ అశ్విన్, మారుతి, శేఖర్ కమ్ముల సంపత్ నంది… వీళ్లు కూడా ఆచి తూచి అడుగులేస్తున్నవాళ్లే. ఎవరూ ఎప్పుడూ కంగారు పడడం లేదు. `నిదానంగా సినిమాలు తీసుకుందాంలే` అనుకుంటున్నారంతా.
ఇలాంటి దర్శకులకు నెంబర్ అనేది ఎప్పుడూ సమస్య కాదు. క్వాలిటీ కావాలనుకుంటారు. కానీ.. చిత్రసీమకు నెంబర్ కూడా ముఖ్యమే. ఎన్ని సినిమాలు నిర్మితమయితే అంత పని దొరుకుతుంది. లాక్ డౌన్ తరవాత సినిమా పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు. కాకపోతే… ఇప్పుడు కార్మికులకు పని కావాలి.
చిత్రసీమలో వీలైనంత ఎక్కువగా ప్రొడక్షన్ జరగాలి. అలా జరగాలంటే.. దర్శకులంతా స్పీడు పెంచాలి.లేదంటే ఈ నిదానం మరో రకమైన సంక్షోభానికి దారి తీసే ప్రమాదం ఉంది.